ఆటోలో... స్కూల్‌కు వెళ్లేవాణ్ణి!

10 Dec, 2014 22:21 IST|Sakshi
ఆటోలో... స్కూల్‌కు వెళ్లేవాణ్ణి!

 మహేశ్‌బాబు మితభాషి. మీడియా ముందు కూడా చాలా తక్కువగా మాట్లాడతారు.సినిమాల గురించి తప్ప, వ్యక్తిగత విషయాల గురించి మాత్రం అస్సలు ప్రస్తావించరు. ఇటీవల ఓ కార్యక్రమంలో మనసు విప్పి మాట్లాడారు. చిన్నప్పటి విషయాలు, తన మనస్తత్వం,పిల్లల గురించి ఇలా ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు...
 
 నేను పెరిగింది చెన్నయ్‌లో. చదువుకున్నదీ అక్కడే. అందరి పిల్లల్లా నేనూ సాదాసీదాగానే ఉండేవాణ్ణి. అందరిలానే నేనూ ఆటోరిక్షాలో స్కూల్‌కి వెళ్లేవాణ్ణి. మా నాన్న సూపర్‌స్టార్ కృష్ణ అని చెబితే.. అందరూ ప్రత్యేకంగా చూస్తారేమోనని స్కూల్లో ఎవరికీ చెప్పలేదు. మా నాన్నకు కూడా అదే ఇష్టం. ఓసారి సమ్మర్ హాలిడేస్‌లో మా నాన్న ఓ సినిమాలో యాక్ట్ చేయమంటే చేశాను. అప్పట్నుంచీ వేసవి సెలవుల్లో సినిమాలు చేయడం ఆనవాయితీ అయ్యింది. చెన్నయ్‌లో తెలుగు సినిమాలు చూసేవాళ్లు తక్కువమంది కాబట్టి, నేను ‘చైల్డ్ స్టార్’ అని ఎవరికీ తెలియదు. అలా తెలియకపోవడం నాకు మంచిదైంది. లేకపోతే ప్రత్యేకంగా చూసేవాళ్లు.. నాకు దూరంగా ఉండేవాళ్లు.
 
 డేటింగ్ మీద నాకు ఆసక్తి లేదు. ఒకవేళ మూడు గంటలపాటు లాస్ ఏంజిల్స్‌లో ఎవరినైనా డిన్నర్ డేట్‌కి తీసుకెళ్లాల్సి వస్తే.. ఎవరిని తీసుకెళతారని అడిగితే... హాలీవుడ్ స్టార్ డెమీ మూర్ పేరు చెబుతాను.  కానీ, మూడు గంటలసేపు డిన్నర్ డేట్ అంటే బోరింగ్‌గా ఉంటుంది కదా.
 
 ‘1’ చిత్రంలో నటించిన తర్వాత మా అబ్బాయి గౌతమ్‌కి సినిమాలంటే ఆసక్తి పెరిగింది. కానీ, పెద్దైన తర్వాత తన ఆలోచనలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. సో.. భవిష్యత్తులో తనేమవుతాడో కాలమే చెబుతుంది. ఇప్పుడిప్పుడే గౌతమ్ నా సినిమాలు చూస్తున్నాడు. ఎక్కువ శబ్దం ఉండే సన్నివేశాలు తనకు పెద్దగా నచ్చవు.
 
 జీవితం సాఫీగా సాగాలంటే డబ్బు చాలా అవసరం. అందుకే, డబ్బు సంపాదించడానికి కష్టపడాలి. మా నాన్న నాకు చెప్పిన మాటలివి. నా పిల్లలకు కూడా నేనీ మాటలే చెప్పాలనుకుంటున్నా.
 
 చీటికీ మాటికీ కోపం తెచ్చుకునే తత్వం కాదు నాది. అరుదుగా వస్తుంది.. అది కూడా ఇంట్లో ఉన్నప్పుడే. ఆ కోపం ఐదు నిమిషాల్లోనే పోతుంది.
 
 నాకైతే మా అమ్మాయి సితారను సైంటిస్ట్‌ను చేయాలని ఉంది. మరి.. పెద్దైన తర్వాత తనేం కావాలనుకుంటుందో చూడాలి.
 స్వతహాగా నేను ఫుడ్ లవర్‌ని. కానీ, షూటింగ్స్ అప్పుడు డైట్ కంట్రోల్ చేయాలి కదా. అందుకే, హాలిడేస్‌లో డైట్ పాటించను. నచ్చినవన్నీ లాగించేస్తా. నా ఫేవరెట్ హాలిడే స్పాట్ దుబాయ్.