నేను తీసుకున్న మంచి నిర్ణయం సరిలేరు నీకెవ్వరు చేయటమే

19 Jan, 2020 00:06 IST|Sakshi
దేవిశ్రీ ప్రసాద్, అనిల్‌ సుంకర, రష్మిక, ‘దిల్‌’ రాజు, విజయశాంతి, అనిల్‌ రావిపూడి, మహేశ్‌బాబు

– మహేశ్‌బాబు

‘‘నా కెరీర్‌లో నేను తీసుకున్న మంచి నిర్ణయం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేయటమే. 20 ఏళ్ల కెరీర్‌లో ఇంత అద్భుతమైన స్పందనను నేనెప్పుడూ ఎక్స్‌పీరియన్స్‌ చేయలేదు. నాన్న అభిమానులు, నా అభిమానుల తరఫున దర్శకుడు అనిల్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు మహేశ్‌బాబు. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న విడుదలైన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేశ్‌బాబు, రష్మిక జంటగా ‘దిల్‌’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్‌బాబు కూడా ఓ నిర్మాతగా వ్యవహరించారు.

అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతి ప్రత్యేక పాత్రలో నటించారు. ‘బ్లాక్‌బస్టర్‌ కా బాప్‌’ పేరుతో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా 100 కోట్ల షేర్‌ పోస్టర్‌ను చిత్రం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘అనిల్‌ రావిపూడి ఈ సినిమాలో ఎన్నో మంచి డైలాగులు రాశారు. కానీ, ‘రమణా.. లోడెత్తాలిరా’ అనే డైలాగ్‌ మాత్రం బీభత్సంగా పేలింది. కథ వినగానే దేవిశ్రీ ప్రసాద్‌ మాస్‌ సాంగ్‌ చేయటానికి మంచి అవకాశం ఉందని ముందే చెప్పారు. అలా వచ్చిందే ‘మైండ్‌ బ్లాంక్‌’ సాంగ్‌. ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో విజయశాంతి గారితో నటించాను. ఆ సినిమా పెద్ద హిట్‌.

ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ సంక్రాంతిని ఎప్పటికీ మరచిపోను. నాలుగైదేళ్లుగా నా అభిమానులు, ప్రేక్షకులు కొత్త మహేశ్‌ను కోరుకుంటున్నారు. అది ఈ సినిమాతో సాధ్యం చేసిన నిర్మాత అనిల్‌ సుంకరగారికి థ్యాంక్స్‌’’ అన్నారు. విజయశాంతి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని ‘బ్లాక్‌బస్టర్‌ కా బాప్‌గా నిలిపిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను. సైనికుల తల్లిదండ్రుల బాధ ఏంటో అనిల్‌ ఈ చిత్రంలో సందేశాత్మకంగా చూపించారు. మహేశ్‌బాబుతో పని చేయటం కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో చేసిన భారతి పాత్ర నా కెరీర్‌కి ఎంతో ప్రత్యేకం. రాములక్కా.. మళ్లీ సినిమాలు చేయండి అని అడుగుతున్నారు. ఈ రాములక్క సినిమా చేయాలంటే సబ్జెక్ట్‌ బాగుండాలి, పాత్ర దద్దరిల్లాలి’’ అన్నారు.

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ– ‘‘మహర్షి’ సినిమా సక్సెస్‌ మీట్‌లో అన్నాను... మహేశ్‌ సార్‌ నా సినిమా వల్ల మీ ముఖంలో నవ్వురావాలి, మిమ్మల్ని ఆనందంగా చూడాలి అని. సినిమా విడుదలైన రోజు నుండి నేను ఆయనతోనే ఉంటున్నాను. ఆయన ఎంతో సంతోషంగా ఉంటున్నారు. బాబు బ్యాటింగ్‌ మొదలయ్యింది, ఫస్ట్‌ వీక్‌ 100 కోట్లు కలెక్ట్‌ చేసింది’’ అన్నారు. ‘‘మహేశ్‌తో ఇలాంటి జోనర్‌లో సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నా. ఎవరూ ఊహించని విధంగా ఆయన నటన  ఉంది. అనిల్‌ రావిపూడికి థ్యాంక్స్‌’’ అన్నారు దేవిశ్రీ  ప్రసాద్‌.  ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, యం.ఎల్‌.ఏ వినయ్‌ భాస్కర్, వరంగల్‌ సీపీ రవీందర్‌తో పాటు నటుడు రాజేంద్రప్రసాద్, నిర్మాతలు ‘దిల్‌’ రాజు, అనిల్‌ సుంకర, దర్శకులు వంశీ పైడిపల్లి, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు