‘1... నేనొక్కడినే’లో బుల్లి మహేష్‌గా గౌతమ్ కృష్ణ

9 Jul, 2013 02:53 IST|Sakshi
‘1... నేనొక్కడినే’లో బుల్లి మహేష్‌గా గౌతమ్ కృష్ణ
బాల నటులుగా చాలామంది హీరోలు నటించారు కానీ... మహేష్‌బాబు మాత్రం వారిలో ప్రత్యేకం. ఎందుకంటే... చైల్డ్ హుడ్‌లోనే ‘స్టార్’ అనిపించుకున్నారు మహేష్. కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్నాతమ్ముడు లాంటి సినిమాలైతే కేవలం మహేష్ కారణంగా విజయాలు సాధించాయని చెప్పాలి. చిన్న వయసులోనే ద్విపాత్రాభినయం చేసి నాటి హీరోలకు తానేం తక్కువ కాదని నిరూపించుకున్నారాయన. 
 
 ఇప్పుడు మహేష్ చిన్ననాటి సంగతుల గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే.. త్వరలో మహేష్ తనయుడు గౌతమ్ బాలనటునిగా తెరపై సాక్షాత్కరించబోతున్నాడు. ప్రసుతం మహేష్ నటిస్తున్న  ‘1... నేనొక్కడినే’ చిత్రంలో మహేష్ చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. ‘1’ చిత్రంలో గౌతమ్ నటించనున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. అయితే... ఆ విషయాన్ని మహేష్ మాత్రం నిర్ధారణ చేసి చెప్పలేదు. 
 
 దాంతో ఆ వార్త గాసిప్పుల లిస్ట్‌లో చేరిపోయింది. కాగా, ఇప్పుడు అనుకోని విధంగా గౌతమ్ కెమెరా ముందుకు రావడంతో గతంలో వినిపించిన వార్త నిజమే అని నిర్ధారణ అయ్యింది. ‘1’లో మహేష్ పాత్రను దర్శకుడు సుకుమార్ ప్రయోగాత్మకంగా తీర్చిదిద్దారని సమాచారం. ‘నేనొక్కడినే...’ అని అయన కచ్చితంగా చెప్పడం వెనుక ఓ బలమైన కారణమే ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా ద్వారా బాలనటునిగా పరిచయం అవుతున్న గౌతమ్... పాతికేళ్ల క్రితం నాటి తండ్రి ఫీట్‌ని రిపీట్ చేస్తాడో లేదో తెలియాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.