కొడుకు మరణం.. కూతురు ఆత్మహత్య

10 Oct, 2019 19:35 IST|Sakshi

కింగ్‌ ఆఫ్‌ గజల్స్‌ జగ్జీత్‌ సింగ్‌ వర్ధంతి నేడు

‘గజల్‌ కింగ్‌’గా పేరుగాంచిన ప్రఖ్యాత గాయకుడు, సంగీత దర్శకుడు జగ్జీత్‌ సింగ్‌ వర్ధంతి నేడు. భౌతికంగా దూరమైనప్పటికీ.. ‘తుమ్‌ ఇత్నా జో ముస్కురా రహే హో’ పాటకు గాత్రదానం చేసిన ఆయన.. నేటికీ అభిమానుల మనస్సులో సజీవంగా ఉన్నారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తన శ్రావ్యమైన గొంతుతో ఎంతో మందికి ఊరట కలిగించిన జగ్జీత్‌ జీవితంలో మాత్రం విషాదఘటనలే ఎక్కువగా ఉండటం విచారకరమైన అంశం. కాగా గురువారం నాటికి జగ్జీత్‌ తుదిశ్వాస విడిచి ఎనిమిదేళ్లు అయిన సందర్బంగా సగటు అభిమానులతో పాటు.. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఆయనను స్మరించుకుంటున్నారు. ‘ నా గాయాలను తన గొంతులో పలికించారు. ఆర్త్‌ సినిమా పాటలు ఇంకా నా గుండెలో నిలిచే ఉన్నాయి. నా జీవితాన్ని సార్ధకం చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ బాలీవుడ్‌ దర్శకుడు మహేష్‌ భట్‌ జగ్జీత్‌ సింగ్‌తో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.

1982లో మహేష్‌ భట్‌ దర్శకత్వంలో షబానా అజ్మీ, కుల్‌భూషణ్‌ కర్బందా, స్మితా పాటిల్‌, రోహిణి హట్టంగడి తదితర తారాగణంతో తెరకెక్కిన ఆర్త్‌ సినిమా ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. భర్త వదిలేసిన స్త్రీగా, ఒంటరి మహిళగా షబానా అద్భుత నటనకు.. జాతీయ ఉత్తమ నటి అవార్డును సైతం తెచ్చిపెట్టింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు జగ్జీత్‌ సింగ్‌, చిత్రా సింగ్‌ సంగీతం అందించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే తొలుత జగ్జీత్‌తో కలిసి పనిచేయడానికి ఇష్టపడని చిత్రా.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో భార్యగా ఆయన జీవితంలో అడుగుపెట్టడం విశేషం.

1967లో ప్రారంభమైన జగ్జీత్‌-చిత్రాల పరిచయం క్రమేపీ బలపడి ప్రేమ బంధానికి దారితీసింది. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలకు కలిసి పనిచేసిన వీరు ‘హిట్‌ పెయిర్‌’గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో చిత్రా ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చారట జగ్జీత్‌. అయితే అప్పటికే తనకు డెబో ప్రసాద్‌తో పెళ్లి కావడం, ఓ కూతురు కూడా ఉండటంతో జగ్జీత్‌ ప్రేమను ఆమె నిరాకరించారట. భర్తకు దూరంగా ఉన్నంత మాత్రాన మరో పెళ్లి చేసుకోలేనని కరాఖండిగా చెప్పారట. అయితే జగ్జీత్‌ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలాగా తన ప్రయత్నాలు కొనసాగించారట. చిత్ర మీద ఉన్న అమితమైన ప్రేమతో ఏకంగా ఆమె మొదటి భర్త దగ్గరికి వెళ్లి... ‘ నేను మీ భార్యను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను’ అని చెప్పారట. చెప్పినట్లుగానే ప్రసాద్‌- చిత్ర విడాకులు తీసుకున్న అనంతరం 1969లో జగ్జీత్‌ ఆమెను పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు చిత్ర మొదటి భర్త కూతురు మోనికాకు కూడా తండ్రిప్రేమ పంచారు.

కొడుకు మరణం.. కూతురు ఆత్మహత్య
సాఫీగా సాగిపోతున్న సంగీత జంట జగ్జీత్‌- చిత్రాల జీవితంలో వారి కొడుకు వివేక్‌ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. 1990లో జరిగిన ఓ కారు ప్రమాదంలో వివేక్‌(20) దుర్మరణం పాలయ్యాడు. ఈ బాధతో చిత్ర.. సంగీతాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మిక బాటను ఎంచుకున్నారు. జగ్జీత్‌ కూడా ఏడాది పాటు సంగీతానికి దూరం అయినప్పటికీ.. తన జీవితంలో చోటుచేసుకున్న ఘటనలను సంగీతం రూపంలో ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇక కొడుకు మరణంతో కుంగిపోయిన చిత్ర దంపతులను 2009లో మరో విషాదం వెంటాడింది. తన వైవాహిక జీవితం విఫలమైందనే బాధతో చిత్ర కూతురు మోనికా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో 2011,  అక్టోబరు 10న తన 70వ ఏట.. తన భార్య చిత్రను ఒంటరిని చేస్తూ జగ్జీత్‌ తుదిశ్వాస విడిచి ఆమెను మరింత విషాదంలోకి నెట్టారు. అభిమానులను శోకసంద్రంలో ముంచారు.

>
మరిన్ని వార్తలు