20 ఏళ్ల తర్వాత!

21 Sep, 2018 02:47 IST|Sakshi
మహేశ్‌ భట్, పూజా భట్, సంజయ్‌ దత్, ఆలియా భట్, ఆదిత్యారాయ్‌

ఇక మహేశ్‌ భట్‌ మెగాఫోన్‌ పట్టుకునే చాన్స్‌ లేదు. డైరెక్షన్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టేసినట్లే అని ఎవరికి వాళ్లు ఫిక్స్‌ అవుతున్న తరుణంలో ఆయన ఓ షాకిచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘కార్‌తూస్‌’ 1991లో విడుదలైంది. ఇన్నేళ్లు గ్యాప్‌ తీసుకున్నారు కాబట్టి అలా అనుకోవడం సహజం. అయితే 70వ పుట్టినరోజు (గురువారం) నాడు తన కొత్త సినిమాని మహేశ్‌ భట్‌ ప్రకటించారు. 1991లో తాను తెరకెక్కించిన ‘సడక్‌’ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించడానికి పూనుకున్నారు.

‘అర్థ్, సారాన్ష్, దిల్‌ హై కే మాన్‌తా నహీ, ఆషికీ’ వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలకు మహేశ్‌ భట్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ‘సడక్‌ 2’ నటీనటుల విషయానికి వస్తే... సంజయ్‌దత్, ఆలియా భట్, పూజా భట్, ఆదిత్యారాయ్‌ కపూర్‌ కీలక పాత్రలు చేయనున్నారు. సంజయ్‌ దత్, పూజా భట్‌ తొలి పార్ట్‌లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాతో తండ్రి మహేశ్‌ భట్‌తో తొలిసారి వర్క్‌ చేయనున్నారు ఆలియా భట్‌. అలాగే సిస్టర్‌ పూజా భట్‌తో స్క్రీన్‌ను షేర్‌ చేసుకోబోతున్నారు.

మహేశ్‌ భట్‌ దర్శకత్వంలో దాదాపు 25 ఏళ్ల తర్వాత నటిస్తున్నారు సంజయ్‌ దత్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో చివరిసారిగా 1993లో ‘గుమ్‌రాహ్‌’ సినిమా వచ్చింది. అలాగే  ‘ఆషికీ 2’ తర్వాత ముఖేష్‌ భట్‌ నిర్మాణంలో ఆదిత్యారాయ్‌ కపూర్‌ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ‘సడక్‌ 2’ సినిమాకు సంజయ్‌దత్‌నే అంకురార్పణ చేశారట. ‘‘నాన్నగారి బర్త్‌డేకి నాకు మంచి గిఫ్ట్‌ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో నటించాలన్న నా కల నిజమైంది’’ అని ఆలియా ఓ ఎమోషనల్‌ నోట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే స్టార్ట్‌ కానుంది. ఈ చిత్రం 2020 మార్చి 25న రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు