‘అజ్ఞాతవాసి’ గురించి మహేశ్‌ కత్తి చెప్పిందే నిజమైందా?

10 Jan, 2018 11:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ​25వ సినిమా ‘అజ్ఞాతవాసి’ సినిమా గురించి ఫిలిం క్రిటిక్‌ మహేశ్‌ కత్తి చెప్పింది చెప్పినట్లే జరిగిందా? ‘త్రివిక్రమ్‌ కాపీ దెబ్బకి ప్రొడక్షన్‌ హౌస్‌ బలైపోయింద’న్న కత్తి వ్యాఖ్యలు మరోసారి నిజమయ్యాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా బుధవారం విడుదలైన ‘అజ్ఞాతవాసి’... ఫ్రెంచ్ సినిమా ‘లార్గో వించ్‌’ కు ఇన్సిపిరేషన్‌ కాదు.. మక్కీకి మక్కీ కాపీనే అనే అభిప్రాయం వెల్లడైంది. ఏకంగా ‘లార్గో వించ్‌’ దర్శకుడు జెరోమ్‌ సలే.. ‘అజ్ఞాతవాసి’  షో చూశాక ‘కాపీ’ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయా దేశాల కాపీరైట్‌ చట్టాలను అనుసరించి జెరోమ్‌.. ‘అజ్ఞాతవాసి’ దర్శకనిర్మాతలపై కేసు వేస్తారా, లేదా తెలియాల్సిఉంది.

‘అజ్ఞాతవాసి’పై ఇటీవలే పోస్టు పెట్టిన మహేశ్‌ కత్తి.. అందులో.. ‘‘త్రివిక్రమ్ కాపీ దెబ్బకి రెండోసారి ఒకే ప్రొడక్షన్ హౌస్ బలి అయ్యిందట పాపం. నవలని, పాత సినిమాని ఎత్తేస్తే కాస్త ఖర్చుతో పోయింది. ఈసారి ఏకంగా యూరోపియన్ సినిమా. వాళ్ళ కరెన్సీ యూరోలు మరి. ఇలా ఖర్సైపోతే ఎలా కోటేశ్వర్రావా!!!’’ అని రాసుకొచ్చిన సంగతి తెలిసిందే. పవన్‌ సినిమా ఫ్రెంచ్‌ సినిమాను పోలి ఉంటుందనే అభిప్రాయం వెల్లడైనప్పటికీ.. దర్శకనిర్మాతలు స్పందిచలేదు. ఇప్పుడది కాపీనే అని రూఢీఅయిన దరిమిలా వివరణ ఇస్తారో, లేదో వేచిచూడాలి!

‘లార్గో వించ్‌’ డైరెక్టర్‌ జెరోమ్‌ సలే ట్వీట్‌..
 

మరిన్ని వార్తలు