మళ్లీ ఇస్తారు...

9 Nov, 2016 23:10 IST|Sakshi
మళ్లీ ఇస్తారు...

‘ఊరి నుంచి చాలా తీసుకున్నారు.. తిరిగిచ్చేయాలి.. లేకపోతే లావైపోతారు...’ ఈ డైలాగ్ వినగానే గుర్తొచ్చే చిత్రం ‘శ్రీమంతుడు’. మహేశ్‌బాబు, కొరటాల శివ కాంబినేషన్లో గత ఏడాది వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు, మహేశ్ కెరీర్‌లో బిగ్ హిట్‌గా నిలిచి వంద కోట్ల క్లబ్‌లో చేరింది. అందుకే మళ్లీ మహేశ్-కొరటాల కాంబినేషన్ కోసం అభిమానులు ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు బుధవారంతో తెరపడింది. మహేశ్‌బాబు హీరోగా కొరటాల దర్శకత్వంలో డీవీవీ ఎంటర్ టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. దేవుడి చిత్ర పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి.సురేశ్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో నిర్మాత ఎం.శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్ ఇచ్చారు.

మురుగదాస్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేశ్ ఈ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచేలా ఈ చిత్రం తెరకెక్కిస్తాం. ‘శ్రీమంతుడు’ కథ కంటే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పటి వరకూ కనిపించని విధంగా మహేశ్ ఓ వైవిధ్య పాత్రలో కనిపిస్తారు. హీరోయిన్ ఎంపిక జరుగుతోంది’’ అని తెలిపారు. ‘‘మహేశ్‌తో ఓ సూపర్ హిట్ చిత్రం తీయాలనే నా చిరకాల కోరిక ఈ చిత్రంతో తీరుతున్నందుకు ఫుల్ హ్యాపీ.

వరుస హిట్లు ఇస్తున్న కొరటాలతో పని చేస్తుండటం గర్వంగా ఉంది. మహేశ్-కొరటాల మళ్లీ సూపర్ హిట్ ఇస్తారు’’ అని నిర్మాత చెప్పారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ- ‘‘కొరటాలగారి చిత్రాలన్ని టికీ నేను సంగీతం అందిస్తుండటం హ్యాపీ. ‘శ్రీమంతుడు’ పాటలు హిట్ అయ్యాయి. ఈ చిత్రం పాటలు అంతకన్నా పెద్ద హిట్ అవుతాయి’’ అన్నారు. కెమెరామ్యాన్ రవి కె.చంద్రన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.