నెట్టింట్లో రచ్చరచ్చ.. దేవిశ్రీనా మజాకా!

29 Dec, 2019 11:07 IST|Sakshi

దేవిశ్రీప్రసాద్‌ మరోసారి తన మ్యాజిక్‌ చూపించాడు. పార్టీ సాంగ్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే ఈ క్రేజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తాజాగా మరోసారి తన మార్క్‌ పార్టీ సాంగ్‌తో దుమ్ములేపాడు. ఇప్పటివరకు ఎన్నో ఐటమ్‌, పార్టీ సాంగ్‌లను అందించిన దేవి తాజాగా ‘డాంగ్‌ డాంగ్‌’ సాంగ్‌తో ముఖ్యంగా యూత్‌ను ఉర్రూతలూగిస్తున్నాడు. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. డిసెంబర్‌లో ప్రతి సోమవారం ఒక్కో పాటను రిలీజ్‌ చేస్తూ ఇప్పటివరకు నాలుగు పాటలను రిలీజ్‌ చేసింది. చివరి పాటను రేపు(సోమవారం) విడుదల చేయనున్నారు.

అయితే ఈ పాటకు సంబంధించిన చిన్న వీడియో ప్రోమోను శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఈ వీడియోలో మహేశ్‌, తమన్నాల డ్యాన్స్‌ హైలెట్‌గా నిలిచింది. పాట ఎంత బాగుందో అంతకుమించి డ్యాన్స్‌ ఫార్మెషన్స్‌, మహేశ్‌-తమన్నాల స్టెప్పులు అదిరిపోయాయి. దీంతో ప్రస్తుతం ఆ చిన్న వీడియో ప్రోమో నెట్టింట్లో రచ్చరచ్చ చేస్తోంది. దేవిశ్రీ ఈజ్‌ బ్యాక్‌ అని కొందరు కామెంట్‌ చేస్తుండగా.. మహేశ్‌-తమన్నాలు స్టెప్పులు సూపర్బ్‌ అంటూ మరికొందరు పేర్కొంటున్నారు.
 ఈ ప్రోమో విడుదల సందర్భంగా అనిల్‌ రావిపూడి ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘అందరికీ అడ్వాన్స్‌ హ్యాపీ న్యూ ఇయర్‌. సరిలేరు నీకెవ్వరు పాటలను ఇంత బాగా ఆదరించిన ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలు. అలాగే దేవిశ్రీప్రసాద్‌కు నా స్పెషల్‌ థ్యాంక్స్‌. చాలా మంచి పాటలు ఇచ్చారు. ఈ నెలలో ప్రతీ సోమవారం ఒక్కొపాటతో మీ ముందుకు వచ్చాం. ప్రతీ పాటను మీరు అద్భుతంగా రిసీవ్‌ చేసుకుని, టిక్‌టాక్‌లలో వీడియోలు చేస్తూ ట్రెండ్‌ చేశారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే గత సోమవారం వచ్చిన డిఫరెంట్‌ ఆంథమ్‌ సాంగ్‌ను కూడా చాలా బాగా రిసీవ్‌ చేసుకున్నారు.

ఈ సోమవారం ఆల్బమ్‌లో చివరి పాటగా ఓ పార్టీ సాంగ్‌ రాబోతుంది. కొంతమంది సినీ స్టార్స్‌ను తీసుకెళ్లి, ఆర్మీతో ఇంట్రాక్ట్‌ చేయిస్తుంటారు. దానిని స్పూర్థిగా తీసుకుని ఈ సినిమాలో తమన్నా కూడా ఓ సినీ స్టార్‌గా వచ్చి  ఆర్మీతో కలిసి సందడి చేస్తారు. ఇది కేవలం సరదా పాట మాత్రమే. ఐటమ్‌ సాంగ్‌ కాదు. ఈ పాట కూడా మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నా. ఈ ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్‌2’ తో మంచి విజయాన్ని అందించారు. రాబోయే సంక్రాంతికి అంతే వినోదంతో మహేశ్‌బాబు సరికొత్త పాత్రతో అలరించబోతున్నారు’అంటూ అనిల్‌ రావిపూడి ఆ వీడియోలో పేర్కొన్నాడు. 

మహేశ్‌ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈచిత్రాన్ని రామబ్రహ్మం సుంకర, ‘దిల్‌’ రాజు, మహేశ్‌బాబులు నిర్మించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌, పాటలతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. దాదాపు దశాబ్దం తర్వాత ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ పొడక్షన్స్‌ పనులు జరుపుకుంటోంది. మహేశ్‌ కూడా తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పేశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురాబోతుంది. 

చదవండి:
జనవరి 5న కలుస్తానంటున్న రష్మిక
సూపర్‌స్టార్‌ ఈవెంట్‌కు మెగాస్టార్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు