భాగ్యనగరంలో నాన్‌స్టాప్‌గా!

4 May, 2017 00:24 IST|Sakshi
భాగ్యనగరంలో నాన్‌స్టాప్‌గా!

మహేశ్‌బాబుని రౌండప్‌ చేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా? కన్‌ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేస్తాడు. కన్‌ఫ్యూజ్‌ కాకపోయినా అంతే. ఏది ఏమైనా ఇరగదీయడం ఖాయం. ఇప్పుడు మహేశ్‌ అదే పని మీద ఉన్నారు. ప్రస్తుతం నటిస్తున్న ‘స్పైడర్‌’ సినిమా ఫైట్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణలో మహేశ్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు. నో డూప్‌... వెనక్కి తగ్గేది లేదనే టైపులో ఈ హీరోగారు డూప్‌ లేకుండా రిస్కీ ఫైట్స్‌ చేస్తున్నారట. ఆ మాటకొస్తే ఈ సినిమాలో మిగతా ఫైట్స్‌ని కూడా డూప్‌ లేకుండా చేశారట. అభిమానులకు ఈ ఫైట్స్‌ ఐ–ఫీస్ట్‌ అని యూనిట్‌ సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ‘ఠాగూర్‌’ మధు, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం భాగ్యనగరంలో జరుగుతోంది. ఫైట్‌ సీక్వెన్స్‌ తీస్తున్నారు. మంగళవారం నుంచి నాన్‌స్టాప్‌గా సినిమా పూర్తయ్యే వరకూ హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుతారు. ఇందులో మహేశ్‌ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయికగా నటిస్తున్నారు. దాదాపు వంద కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మహేశ్‌ బాబు బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.