తొలిసారి మౌనం వీడారు!

18 Oct, 2017 19:57 IST|Sakshi

పాకిస్థాన్‌ నటి మహిరా ఖాన్‌ తొలిసారి మౌనం వీడారు. బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి తాను సిగరెట్‌ తాగుతున్న ఫొటోలపై ఆమె స్పందించారు. న్యూయార్క్‌లో వీరిద్దరు కలిసి సిగరెట్‌ తాగుతున్న ఫొటోలు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య ఏదో కొనసాగుతున్నదని, వీరి మధ్య ఎఫైర్‌ ఉందని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. ఈ ఫోటోల్లో మహిరా ఖాన్‌ బ్యాక్‌లెస్‌ డ్రెస్‌లో కనిపించడంతో ఆమెపై పాక్‌ నెటిజన్లు విరుచుకుపడ్డారు.

తాజాగా తన తాజా సినిమా 'వెర్నా' ప్రమోషన్‌లో భాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్న మహిరా ఖాన్‌.. ఈ ఫొటోల గురించి ప్రశ్నించగా.. 'నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను. ప్రజలు వద్దని చెప్తే.. సినిమాల్లో వారికి అభీష్టానికి భిన్నంగా చేయను. అలాంటిది ప్రపంచానికి చూపించేలా నేను ఎందుకు చేస్తాను' అని ఆమె పేర్కొన్నారు.

రణ్‌బీర్‌ను కలుసుకోవడంపై స్పందిస్తూ.. 'అది నా వ్యక్తిగత జీవితం. ఒక అబ్బాయి, అమ్మాయి బయటకు కలిసి వెళ్లడం సర్వసాధారణం' అని బదులిచ్చారు. ఈ ఘటన నుంచి తాను గుణపాఠం నేర్చుకున్నట్టు చెప్పారు. 'ప్రస్తుతం మీడియా ఈవెంట్లలోనే కాదు ప్రతిచోటా ఉంటోంది. కాబట్టి దీని నుంచి నేను నేర్చుకున్నాను' అని మహిరా చెప్పింది.

సిగరెట్‌ ఫొటోల వివాదంలో ఇప్పటికే రణ్‌బీర్‌ మహిరాకు అండగా నిలబడిన సంగతి తెలిసిందే. ఆయన గతంలో స్పందిస్తూ.. 'మహిరా నాకు గత కొంత కాలంగా తెలుసు. ఒక వ్యక్తిగా కంటే ఆమె సాధించిన విజయాలకు ఆకర్షితుడనై నేను ఆమెకు అభిమానిగా మారిపోయా. కానీ, ఆమె ఫోటోపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదు. ఒక మహిళ అని కూడా చూడకుండా ఫోటో ఆధారంగా ఆమెను చులకనగా చేసి కామెంట్లు చేశారు. అది మంచి పద్ధతి కాదు. ముందు ఆ నెగటివ్‌ ఆలోచనలు మానుకుని దేవుడిచ్చిన జీవితాన్ని ప్రశాంతంగా.. సంతోషంగా గడపండి’ అంటూ రణ్‌ వీర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. పైగా సిగరెట్‌ తాగడమే కాదు.. ఇలా అసహ్యించుకోవటం కూడా ఆరోగ్యానికి హానికరమేనంటూ ఓ కొటేషన్‌ కూడా ఉంచాడు.

మరిన్ని వార్తలు