హైదరాబాద్‌ ఫిల్మ్‌ క్యాపిటల్‌గా తయారవుతుంది : నవీన్‌ మిట్టల్‌

29 Nov, 2017 23:48 IST|Sakshi

‘‘సినీ పరిశ్రమ అనగానే చాలా మంది ముంబైలో ఉన్న హిందీ పరిశ్రమ అనుకుంటున్నారు. భాగ్యనగరం ఫిల్మ్‌ హబ్‌ అవుతోంది. భారతదేశంలో సినిమాకి హైదరాబాద్‌ రాజధానిగా తయారవుతుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల అధికారి నవీన్‌ మిట్టల్‌ అన్నారు. డిసెంబరు 1న హైదరాబాద్‌లో ‘ఇండీవుడ్‌ ఫిల్మ్‌ కార్నివాల్‌’ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌లో సినిమాలు, సీరియల్స్‌ షూటింగ్‌తో పాటు సినిమా పరిశ్రమకు అవసరమైన అన్ని సౌకర్యాలతో కూడిన స్టూడియోలు, ల్యాబ్‌లు ఉన్నాయి. సినిమా రంగాన్ని మరింత ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం సింగిల్‌ విండో విధానం తీసుకొస్తోంది.

 ‘ఇండీవుడ్‌ ఫిల్మ్‌ కార్నివాల్‌’ గత ఏడాది కంటే ఈ ఏడాది మూడు రెట్లు గ్రాండ్‌గా జరగనుంది’’ అన్నారు. ‘‘సినిమా రంగంలో టెక్నాలజీ ఫాస్ట్‌గా మారుతోంది. ప్రజలు కూడా అప్‌డేట్‌ అవాల్సి ఉంది. ‘ఇండీవుడ్‌ ఫిల్మ్‌ కార్నివాల్‌’కి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది’’ అని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పి.రామ్మోహన్‌రావు అన్నారు. ‘‘డిసెంబరు 1 నుంచి 4వ తేదీ వరకు ‘ఇండీవుడ్‌ ఫిల్మ్‌ కార్నివాల్‌’ జరుగుతుంది. ఈ సమావేశానికి 50–60 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. ఈ ఏడాది తొలిసారి 22 విభాగాల్లో టాలెంట్‌ హంట్‌ నిర్వహిస్తున్నాం’’ అని ‘ఇండీవుడ్‌ ఫౌండర్, డైరెక్టర్‌ సోహన్‌ రాయ్‌ అన్నారు. 
 

మరిన్ని వార్తలు