ఈ సినిమాకు ఏదీ పోటీ కాదు - కె.ఎస్. రామారావు

8 Dec, 2014 22:57 IST|Sakshi
ఈ సినిమాకు ఏదీ పోటీ కాదు - కె.ఎస్. రామారావు

 ‘‘40 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నా. అన్ని రకాల సినిమాలూ తీసినా... ప్రేమకథలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నిత్యామీనన్ ద్వారా ఈ కథ నా దగ్గరకొచ్చింది. క్రాంతిమాధవ్ కథను కళ్లకు కట్టినట్టు చెప్పాడు. ఎలా చెప్పాడో అంతకంటే అద్భుతంగా తెరకెక్కించాడు. జ్ఞానశేఖర్ కెమెరా, గోపీసుందర్ సంగీతం ప్రేక్షకులకు ఓ తీయని అనుభూతిని అందిస్తాయి’’ అని కె.ఎస్.రామారావు అన్నారు. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న చిత్రం ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’.
 
 ఈ చిత్రం పాటలను, ప్రచార చిత్రాలను రమేశ్ ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కె.ఎస్.రామారావు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రానికి ప్రధాన బలం స్క్రిప్ట్. సాయిమాధవ్ బుర్రా అద్భు తంగా సంభాషణలు రాశాడు. వెంకటేశ్, పవన్‌కల్యాణ్‌ల ‘గోపాల గోపాల’ చిత్రానికి కూడా ఆయనే సంభాషణలు అందిస్తున్నారు. పంపిణీదారులందరూ సహకరిస్తే... ఈ సినిమాను కూడా ‘గోపాల గోపాల’తోనే సంక్రాంతి కానుకగా విడుదల చేస్తా. ఇది చక్కని ప్రేమకథ కాబట్టి, దీనికి ఏ సినిమా పోటీ కాదు’’ అని తెలిపారు.
 
 మనసుల్ని మెలిపెట్టే ప్రేమకావ్యంగా క్రాంతిమాధవ్ ఈ చిత్రాన్ని మలిచారని శర్వానంద్ అన్నారు. ఈ సినిమాకు పెట్టినంత ఎఫర్ట్ ఇంతవరకూ తాను ఏ సినిమాకూ పెట్టలేదని నిత్యామీనన్ తెలిపారు. తెలుగు భాషంటే తనకు ఇష్టమనీ, క్రాంతిమాధవ్, నిత్యామీనన్ వల్లనే తెలుగు సినిమా చేసే అవకాశం తనకు లభించిందనీ, సంగీత దర్శకుడు గోపీ సుందర్ చెప్పారు.