సమస్యను పరిష్కరించే రాజా

19 Nov, 2019 06:07 IST|Sakshi

‘‘మమ్ముట్టిగారి నటన అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది. ఆయన నటించిన ‘మధుర రాజా’ చిత్రం మలయాళంలో పెద్ద హిట్‌ అయింది. ఈ సినిమా ‘రాజా నరసింహా’ పేరుతో తెలుగులో విడుదలవుతోంది. ట్రైలర్‌ చూస్తే తెలుగులోనూ విజయం సాధిస్తుందనిపిస్తోంది. తొలిరోజే ఈ సినిమా చూస్తా’’ అని డైరెక్టర్‌ బోయపాటి శ్రీను అన్నారు. మమ్ముట్టి హీరోగా ‘మన్యం పులి’ ఫేమ్‌ వైశాఖ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధుర రాజా’. జై, మహిమా నంబియార్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ‘రాజా నరసింహా’ పేరుతో జై చెన్నకేశవ పిక్చర్స్‌ పతాకంపై సాధు శేఖర్‌ ఈ నెల 22న విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్‌ని బోయపాటి శ్రీను విడుదల చేశారు. సాధు శేఖర్‌ మాట్లాడుతూ– ‘‘చ క్కని సందేశంతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘అటవీ ప్రాంతంలోని సమస్యను ‘రాజా నరసింహా’ ఎలా పరిష్కరించాడు? అన్నదే మా చిత్రం. సన్నీ లియోన్‌ ప్రత్యేక గీతం, పీటర్‌ హెయిన్స్‌ పోరాటాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అని వైశాక్‌ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ, సంగీతం: గోపీ సుందర్‌.

మరిన్ని వార్తలు