‘అందులో ఆడవారి తప్పు కూడా ఉంటుంది’

20 Jul, 2018 20:52 IST|Sakshi
మమతా మోహన్‌దాస్‌ (ఫైల్‌ ఫోటో)

‘డబ్య్లూసీసీ’ (వుమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌) అవకాశాల పేరుతో ఆడవారిని మోసం చేసేవారికి వ్యతిరేకంగా, బాధితులకు అండగా నిలబడటం కోసం ఏర్పాటు చేసిన సంస్థ. దాదాపు ప్రతి ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్‌లు ఇందుకు మద్దతు తెలుపుతుండగా మమతా మోహన్‌దాస్‌ మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా స్పందించారు. ‘మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే, అందులో స్త్రీలకు కూడా వాటా ఉంటుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒక ప్రముఖ దినపత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో మమతా మహిళల పట్ల వేధింపుల గురించి స్పందిస్తూ ‘ఎవరైనా మన పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నా, లైంగికంగా వేధించిన లేదా అలాంటి పనులు చేయడానికి సిద్ధపడుతున్నారంటే అందులో ఎంతో కొంత మన (ఆడవారి) తప్పు కూడా ఉంటుంది. అంటే ఒకరు మనతో అలా తప్పుగా ప్రవర్తించే అవకాశం స్వయంగా మనమే వారికి  ఇచ్చి ఉంటాము. అందుకే వారు ఇలాంటి పనులు చేసే ధైర్యం చేయగలుగుతున్నార’న్నారు.

ఆ తర్వాత మమతా వెంటనే తన వ్యాఖ్యలపై స్పష్టతనిస్తూ ‘ఎవరో కొందరినే దృష్టిలో పెట్టుకుని నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. నా మాటలు అందరికి వర్తిస్తాయ’న్నారు. అంతేకాక ‘డబ్య్లూసీసీ గురించి మీ అభిప్రాయం చెప్పండ’ని అడగ్గా ‘అది ఏర్పాటైన సమయంలో నేను ఇక్కడ లేను. నేను ఇందులో భాగస్వామిని అవుతానా అని అడిగితే మాత్రం లేదనే చేప్తాను. ఎందుకంటే డబ్య్లూసీసీ గురించి నాకు ఎటువంటి అభిప్రాయం లేదన్నా’రు.

నటీమణులకు ఎదురవుతున్న వేధింపులు గురించి ప్రశ్నించగా.. ‘ఇలాంటి విషయాల గురించి చర్చించాల్సింది వేధింపులు జరిగాక కాదు. అసలు ఇలాంటి సంఘటనలు జరగకముందే వీటి గురించి చర్చించాలి. ఏది ఏమైనా వేధింపులకు గురి చేసిన వారిని మాత్రం వదిలిపెట్టకూడద’న్నారు. అయితే మమతా వ్యాఖ్యలను నటి రీమా కళంగళ్‌ ఖండించారు.

మమతను ఉద్దేశిస్తూ రీమా తన ఫేస్‌బుక్‌లో ‘ప్రియమైన మమత మోహన్‌ దాస్‌కు, నా సోదర సోదరీమణులకు.. మన సమాజం ఎలా తయారయ్యిందంటే వేధింపులు, అత్యాచారాలు, అపహరణ, హింస వంటి నేరాలను చాలా సాధరణంగా పరిగణిస్తుంది. అలాంటి నేరాలకు పాల్పడే వారిని రక్షిస్తోంది. అందుకే తప్పు చేసిన వారు దర్జాగా తిరుగుతున్నారు. బాధితులు మాత్రం అవమానాలను ఎదుర్కొంటున్నారు. కానీ ఈ నేరాలన్నింటికి బాధ్యత వహించాల్సింది నిందుతులు.. బాధితులు ఎంత మాత్రం కాదు. మనకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా మాట్లాడదాం. ఒకరి కోసం ఒకరం మద్దతుగా నిలుద్దాం. ఇప్పటికైనా నిశ్శబ్దం అనే గోడను బద్దలుకొడదాం’ అంటూ పోస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు