ఐదుగురు జాతీయ అవార్డు గ్రహీతల... మన ఊరి రామాయణం

6 Oct, 2016 13:57 IST|Sakshi
ఐదుగురు జాతీయ అవార్డు గ్రహీతల... మన ఊరి రామాయణం

ప్రకాశ్‌రాజ్ దర్శకుడిగా తీసిన తొలి రెండు సినిమాలు ప్రేక్షకులకు చేరువ కాలేకపోయుండొచ్చు. కానీ ఆయనలో ఓ మంచి కథకుడు ఉన్నాడనే విషయాన్ని మాత్రం ఆ సినిమాలు స్పష్టంగా చాటి చెప్పాయి. మనవైన కథల్ని ప్రేక్షకులకు చూపించాలనే ప్రకాశ్‌రాజ్‌లోని ఓ తపన ఆ సినిమాలతోనే బయటపడింది. అందుకే ఆయన  మళ్లీ మెగాఫోన్ పట్టాడనగానే ప్రేక్షకులు ఆసక్తిగా ఆ సినిమావైపు చూడటం మొదలుపెట్టారు. ‘మన ఊరి రామాయణం’ అంటూ ప్రకాశ్‌రాజ్ దర్శకత్వం వహించి, నటించి, నిర్మించిన ఆ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా  ‘సాక్షి’ పాఠకుల కోసం కొన్ని విశేషాలు...

మనందరి రామాయణం: ప్రతి మనిషిలోనూ రాముడు, రావణుడు ఉంటాడు. పరిస్థితుల్నిబట్టి ఒక్కో సందర్భంలో ఒకొక్కరు మనలో నుంచి బయటికొస్తుంటారు. ఆ విషయాన్నే దుబాయ్ రిటర్న్ అయినటువంటి ఒక వ్యక్తి నేపథ్యంలో చెప్పే ప్రయత్నం చేశారు ప్రకాశ్‌రాజ్. సమాజంలో ఎంతో గౌరవింపబడే ఆ వ్యక్తికి శ్రీరామనవమి సమయంలో ఎదురైన అనుభవాలు ఎలాంటివి? తన జీవితాన్ని ఆ సంఘటనలు ఏ విధంగా మలుపు తిప్పాయి? అనే విషయాల్ని ఆసక్తికరంగా చూపించా మంటున్నారు ప్రకాశ్‌రాజ్.

 

ఐదుగురు జాతీయ అవార్డు గ్రహీతలు: ప్రకాశ్‌రాజ్‌లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, తనకి తెలిసింది చేస్తారు, తెలియని దాని కోసం వినమ్రంగా వేరే వ్యక్తుల దగ్గరికి వెళతారు. ‘మీరే చేయాలి’ అని బాధ్యనంతా వారిపై పెడతారు. ‘మన ఊరి రామాయణం’కి ప్రకాశ్‌రాజ్ ఓ కథకుడు, ఓ దర్శక-నిర్మాత, ఓ నటుడిగా మాత్రమే చేశారు. సాంకేతికత విషయంలో మాత్రం నిష్ణాతులైన వ్యక్తుల్ని సంప్రదించారు. సంగీతం కోసం ఇళయరాజా, ఎడిటింగ్ కోసం శ్రీకర్ ప్రసాద్, కథానారుుక పాత్ర కోసం ప్రియమణి, కళా దర్శకత్వం కోసం శశిధర్ అడపాల్ని సంప్రదించారు. వాళ్లంతా కూడా జాతీయ అవార్డు గ్రహీతలే. ప్రకాశ్‌రాజ్‌తో కలుపుకొంటే మొత్తం ఐదుగురు జాతీయ పురస్కార గ్రహీతలు ‘మన ఊరి రామాయణం’కి పనిచేశారు.

మనదైన ఓ కథని చెప్పాలనే ఓ ప్రయ త్నమే దర్శకత్వంవైపు అడుగేయించింది. దర్శకత్వంలో ఓ గొప్ప సంతృప్తి లభిస్తోంది. నా తొలి, మలి సినిమాల ఫలితాన్ని పట్టించుకోను. ఒక సినిమా ఆడటానికి, ఆడకపోవ డానికి చాలా కారణాలుంటాయి. కానీ మన మనసులోని కథని ఎలా చెప్పామన్నదే నాకు ముఖ్యం. ‘మన ఊరి రామాయణం’ విషయంలో ఓ కథకుడిగా చాలా సంతృప్తిగా ఉన్నా. కానీ నా కథ గురించి నేను సంతృప్తి పడితే సరిపోదు. అది ప్రేక్షకులకూ సంతృప్తినివ్వాలి. ఆ తీర్పు కోసమే ఎదురు చూస్తున్నా. ఫలితమెలా ఉన్నా... నావైన ప్రయత్నాలు ఇకపై కూడా జరుగుతూనే  ఉంటాయి - ప్రకాశ్‌రాజ్