‘మనసుకు నచ్చింది’ మూవీ రివ్యూ

16 Feb, 2018 12:05 IST|Sakshi

టైటిల్ : మనసుకు నచ్చింది
జానర్ : రొమాంటిక్‌ కామెడీ
తారాగణం : సందీప్‌ కిషన్‌, అమైరా దస్తూర్‌, త్రిదా చౌదరి, అదిత్‌ అరుణ్, బేబీ జాన్వీ
సంగీతం : రధన్‌
దర్శకత్వం : మంజుల ఘట్టమనేని
నిర్మాత : సంజయ్‌ స్వరూప్‌, పి.కిరణ్‌

షో సినిమాతో నటిగా వెండితెరకు పరిచయం అయిన సూపర్‌ స్టార్‌ కృష్ణ వారసురాలు మంజుల. తొలి సినిమాతోనే జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న మంజుల తరువాత నటిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా దర్శకురాలిగా మారి మనసుకు నచ్చింది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సందీప్‌ కిషన్‌, అమైరా దస్తర్‌లు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు వాయిస్‌ ఓవర్‌ అందించటంతో మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. నటిగా ప్రూవ్ చేసుకున్నా మంజుల దర్శకురాలిగానూ సక్సెస్‌ సాధించిందా..? ఈ సినిమాతో సందీప్‌ కిషన్‌ హిట్ అందుకున్నాడా..?

కథ :
సూరజ్‌(సందీప్‌ కిషన్‌), నిత్య (అమైరా దస్తూర్‌) ఒకే ఫ్యామిలీలో కలిసి పెరిగిన స్నేహితులు. వాళ్ల స్నేహాన్ని ప్రేమగా భావించిన పెద్దవాళ్లు వాళ్లకు పెళ్లిచేయాలని నిర్ణయిస్తారు. కానీ తమ మధ్య స్నేహం తప్ప ప్రేమ లేదని సూరజ్‌, నిత్యలు ఇంట్లోనుంచి పారిపోతారు. తమ ఫ్రెండ్‌ శరత్‌(ప్రియదర్శి) సాయంతో గోవాలోని ఓ గెస్ట్‌ హౌజ్‌లో ఉంటుంటారు. అప్పటి వరకు ఎలాంటి గోల్స్‌ లేని సూరజ్‌ గోవా వెల్లిన తరువాత ఫొటోగ్రాఫర్‌ కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో ఫెయిల్ అవుతాడు. కానీ నిత్యా ధైర్యం చెప్పటంతో కూల్ అవుతాడు. అదే సమయంలో నిత్య.. తనకు సూరజ్‌ మీద ఉన్నది ఇష్టం కాదు ప్రేమ అని తెలుసుకుంటుంది. సూరజ్‌ కూడా ఏదో ఒకరోజు తన ప్రేమను ఫీల్‌ అవుతాడని ఎదురుచూస్తుంటుంది. కానీ ఈ లోగా గోవాలో పరిచయం అయిన నిక్కి (త్రిదా చౌదరి)ని సూరజ్‌ ఇష్టపడతాడు. అదే సమయంలో అభయ్‌ (అదిత్‌ అరుణ్‌) అనే కుర్రాడు నిత్యను ఇష్టపడతాడు. దీంతో వారి పెద్దలు ఈ రెండు జంటలకు పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. చివరకు సూరజ్‌.. నిత్య ప్రేమను అర్ధం చేసుకున్నాడా..? వారిద్దరు ఒక్కటయ్యారా..? ప్రయాణంలో అసలు ప‍్రకృతి పాత్ర ఏంటి అన్నదే మిగతా కథ.

నటీనటులు :
సందీప్‌ కిషన్‌ తనకు అలవాటైన యూత్‌ ఫుల్‌ క్యారెక్టర్ లో కనిపించాడు. అయితే ఎమోషనల్‌ సీన్స్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌ లో వచ్చే చాలా సన్నివేశాల్లో సందీప్‌ నటన నిరాశపరుస్తుంది. హీరోయిన్‌ అమైర దస్తూర్‌ అందంతో ఆకట్టుకుంది. నటన పరంగానూ పరవాలేదనిపించింది. మరో హీరోయిన్‌గా నటించిన త్రిదా చౌదరి పూర్తిగా గ్లామర్‌ షోకే పరిమితమైంది. ప్రియదర్శి లాంటి లీడింగ్ కమెడియన్‌ను హీరో ఫ్రెండ్‌ పాత్రకు తీసుకున్నా.. సరిగ్గా ఉపయోగించుకోలేదు. ప్రియదర్శి డైలాగ్స్‌లో గత చిత్రాల్లో కనిపించే చమక్కులు ఈ సినిమాలో మిస్‌ అయ్యాయి. ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఘట్టమనేని వారసురాలు, మంజుల కూతురు జాన్వీ మంచి నటన కనబరించింది. ఇంగ్లీష్ కలిసి తెలుగు యాక్సెంట్‌లో జాన్వీ చెప్పిన డైలాగ్స్‌ అలరిస్తాయి. ఇతర పాత్రలు పెద్దగా తెర మీద కనిపించవు. అదిత్‌ అరుణ్‌, నాజర్‌, సంజయ్‌, అనితా చౌదరిలవి దాదాపుగా అతిథి పాత్రలే.

విశ్లేషణ :
మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా చేసిన తొలి ప్రయత్నంలో ఆకట్టుకోలేకపోయింది. రొటీన్‌ ట్రయాంగ్యులర్‌ లవ్‌ స్టోరికి ‘నేచర్‌’ అనే ఎలిమెంట్‌ను జోడించి చేసిన ఈ ప్రయత్నం పూర్తిగా నిరాశపరిచింది. కథలో కొత్తదనం లేకపోవటం కథనం కూడా నెమ్మదిగా సాగటం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. సినిమాలో ఆకట్టుకునే ఒకే ఒక్క అంశం సినిమాటోగ్రఫి, ప్రకృతి అందాలను వెండితెర మీద మరింత అందంగా చూపించారు సినిమాటోగ్రాఫర్ రవియాదవ్‌. రధన్ సంగీతం పరవాలేదు. ఎడిటింగ్‌, నిర్మాణవిలువలు బాగున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా ప్రతీ ఫ్రేము రిచ్‌గా తెరకెక్కించారు. 

ప్లస్ పాయింట్స్ :
సినిమాటోగ్రఫి
హీరోయిన్ల గ్లామర్‌

మైనస్ పాయింట్స్ :
కథా కథనం

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Poll
Loading...
మరిన్ని వార్తలు