మనోజ్‌ బర్త్‌డే.. వలస కూలీలకు సాయం

20 May, 2020 20:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా ఆపత్కాలంలో హీరో మంచు మనోజ్‌ తన పెద్ద మనసును చాటుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం తన పుట్టిన రోజు (మే20)న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీలకు తన వంతుగా కొంత తోడ్పాటును అందించారు. నానా అవస్థలు పడుతూ కాలి నడకన సొంత ఊళ్లకు పయనమైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలస కూలీల కోసం రెండు బస్సులను ఏర్పాటు చేశారు.  వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసి అనంతరం వారిని వారివారి గమ్యస్థానాలకు పంపించే విధంగా మంచు మనోజ్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తమ హీరో చేస్తున్న గొప్ప పనికి మంచు అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

‘ఈ సమయంలో పుట్టినరోజు జరుపుకున్నానంటే నాకంటే మూర్ఖుడు ఎవ్వరూ ఉండరు. లాక్‌ డౌన్‌ లో కష్టంగా ఉందని చాలామంది అంటున్న సంగతి తెలిసిందే. నాకు ఏం కష్టం ఉంది. ఉండటానికి ఇల్లుంది. హాయిగా తింటున్నా. కానీ మనకు ఇల్లు కట్టిన మేస్త్రి అన్న, నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలు, వాళ్ల కష్టాలు, వాళ్ల పిల్లల కష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. సరే కావాల్సిన వాళ్లకు భోజనం పంచుతున్నాం, శానిటైజర్లు పంచుతున్నాం, మనకు తెలిసిన స్నేహితులు, ఫ్యాన్స్‌ అందరూ ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. ఇంకేం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి కొన్ని సంస్థలతో కలసి మన వలస కూలీలను సొంత ఊరు పంపేందుకు బస్సులు ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. దేశ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లాలో అవన్నీ ప్లాన్‌ చేసి, అందరి పర్మిషన్లు తీసుకొని వాళ్లకు భోజనం సమకూర్చి, వాళ్లు వాళ్ల సొంత ప్రాంతానికి చేర్చే బాధ్యత నాది’ అంటూ మంచు మనోజ్‌ ఇదివరకే పేర్కొన్న విషయం తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు