మణిరత్నాన్ని అనుకరించాను - రజనీకాంత్

15 Apr, 2014 23:52 IST|Sakshi
మణిరత్నాన్ని అనుకరించాను - రజనీకాంత్

 స్టయిల్ అనగానే గుర్తొచ్చే పేరు ‘రజనీకాంత్’. చాలామంది ఆ స్టయిలే ఆయన్ను సూపర్‌స్టార్‌ని చేసిందంటారు. నిజానికి స్టయిల్ వల్లే ఆయన అంత ఎత్తుకి ఎదిగారా? సిగరెట్ ఎగరేసి నోటితో క్యాచ్ చేయకపోయినా, చిరుతపులిలా నడవకపోయినా, ఒక రకమైన విరుపుతో డైలాగు చెప్పకపోయినా... ఆయన ఈ స్థాయిలో ఉండేవారు కాదా? ఈ ప్రశ్నలకు సమాధానం రజనీకాంత్ కెరీర్‌ని పరిశీలనాత్మకంగా చూసిన వారికే తెలుస్తుంది. ఈ విషయంపై వారు చెప్పేది ఒక్కటే... ‘రజనీ ఈ స్థాయికి రావడానికి స్టయిల్ అనేది ఓ కారణం మాత్రమే’.  ఇప్పుడు రజనీ స్టయిల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందా! అనుకుంటున్నారా? ఇటీవల జరిగిన తమిళ సంవత్సరాది సందర్భంలో ఓ ఛానల్‌తో ఓ ఆసక్తికరమైన విషయాన్ని ముచ్చటించారు రజనీకాంత్. అది చెప్పడానికే ఈ ఉపోద్ఘాతం.
 
 ‘‘మీ కెరీర్‌లో బాగా కష్టపడి చేసిన సినిమా ‘కోచ్చడయాన్’ అని కోలీవుడ్‌లో చాలామంది అభిప్రాయం. నిజమేనా? ఒక వేళ అది నిజం కాకపోతే... మీ కెరీర్‌లో బాగా కష్టపడి నటించిన సినిమా ఏంటి?’’ ఇది సదరు చానల్ వారు అడిగిన ప్రశ్న. దీనిపై రజనీ మాట్లాడుతూ -‘‘నా కెరీర్‌లో కష్టపడి చేసిన సినిమా అంటే... అది ‘దళపతి’ మాత్రమే. సూపర్‌స్టార్ అనే ఇమేజ్ చట్రంలో చిక్కుకున్న నన్ను ‘సూర్య’ పాత్రలో చూపించడానికి మణిరత్నం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అలాగే ‘సూర్య’గా మారడానికి నేను కూడా అంతే కష్టపడ్డాను. నా సినిమాల్లో సాధారణంగా కనిపించే స్టయిల్స్ ‘దళపతి’లో కనిపించవ్. చాలా సాధారణంగా కనిపిస్తానందులో. పైగా దక్షిణాదిలోనే గొప్ప నటుల్లో ఒకరిగా చెప్పుకునే మమ్ముటితో పోటీగా నటించాలి.
 
 అది నిజంగా నాకు ఛాలెంజ్. అంతకు ముందు కమల్‌హాసన్, నేనూ పోటీపడి పలు చిత్రాల్లో నటించాం. ఆ అనుభవం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ‘దళపతి’ విషయంలో నాకిప్పటికీ గుర్తుండిపోయిన సంఘటన ఒకటుంది. నాతో ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారు మణిరత్నం. నేను మామూలుగానే నా తరహా శైలిలో ఆ ఫైట్‌లో నటిస్తున్నాను. సాధారణంగా ఫైట్‌ని ఓ పనిగా చేస్తాం తప్ప, ఎమోషన్సు చూపిస్తూ చేయడం నేను అంతకు ముందు చేయలేదు. ‘‘మీరు ఎదుటివాణ్ణి కొడుతున్నప్పుడు మీ ఫేస్‌లో ఎమోషన్స్ కనబడాలి’’ అన్నారు మణిరత్నం. అప్పటికే దాదాపు వంద సినిమాల్లో నటించి ఉన్నాన్నేను. ఫైట్స్‌లో ఎమోషన్స్ పలికించడం ఏంటో నాకు అర్థం కాలేదు. కోపంగా కొట్టడం మాత్రం తెలుసు. అయినా... తాను చెప్పినట్లు ప్రయత్నం చేసి చూశా. కానీ నాకే తృప్తిగా అనిపించలేదు.
 
  చివరకు చేసి చూపించమన్నాను. ఎదుటి వ్యక్తిని కొడుతూ ఫేస్‌లో ఎమోషన్స్ ఎలా పలికించొచ్చో మణిరత్నం చేసి చూపించాడు. నేను షాక్. ఆయన్ను అనుకరిస్తూ ఆ సినిమాలో ఫైట్స్ చేశాను. ‘దళపతి’ ఫైట్స్‌లో నా ఎక్స్‌ప్రెషన్స్ పెక్యులర్‌గా ఉంటాయి. అది మీరు మరోసారి గమనిస్తే తెలుస్తుంది’’ అని చెప్పారు.పంచ్ డైలాగులు కానీ, రజనీ మార్క్ స్టయిల్స్ కానీ లేకపోయినా... ‘దళపతి’లోని రజనీ నటనకు జనాలు నీరాజనాలు పలికారు. దక్షిణాదిలోని గొప్ప నటుల్లో ఒకరిగా భాసిల్లే మమ్ముటికి దీటుగా నటించి తాను సూపర్‌స్టార్‌ని మాత్రమే కాదు, గొప్ప నటుణ్ణి కూడా అని నిరూపించారు రజనీ.