మణిరత్నం చిత్రంలో మల్టీస్టారర్స్‌

13 Mar, 2019 13:39 IST|Sakshi

సినిమా: మణిరత్నం తాజా చిత్రం స్టార్స్‌మయంగా మారుతోంది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌ స్టార్స్‌తో చిత్రం చేయబోతున్నారు. నిజం చెప్పాలంటే మణిరత్నంకు మల్టీస్టారర్‌ చిత్రాలు చేయడం కొత్తేమీ కాదు. ఆయన దళపతి చిత్రాన్నే రజనీకాంత్, మమ్ముట్టి, అరవిందస్వామి, శోభన, భానుప్రియ వంటి ప్రముఖ నటీనటులతో చేసి విజయం సాధించారు. అదేవిధంగా ఇటీవల అరవిందస్వామి, శింబు, విజయ్‌సేతుపతి, అరుణ్‌విజయ్, జ్యోతిక వంటి స్టార్స్‌తో సెక్క సివందవానం చిత్రాన్ని తీసి సక్సెస్‌ అయ్యారు.

ఇక తాజాగా పొన్నియన్‌ సెల్వన్‌ అనే చిత్రాన్ని మల్టీస్టారర్స్‌తో చేయడానికి సిద్ధమయ్యారు. నిజానికి ఈ చిత్రాన్ని చాలా కాలం క్రితమే విజయ్, టాలీవుడ్‌ స్టార్‌ మహేశ్‌బాబు, ఐశ్వర్యరాయ్‌ వంటి వారితో చేయ తలపెట్టారు. అయితే అది అప్పట్లో సెట్‌ కాలేదు. తాజాగా అదే చిత్రాన్ని మరింత భారీ తారాగణంతో రూపొందించడానికి రెడీ అయ్యారు. ఇందులో విక్రమ్, విజయ్‌సేతుపతి, జయంరవి, బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్, ఐశ్వర్యారాయ్, టాలీవుడ్‌ స్టార్‌ నటుడు మోహన్‌బాబు వంటి వారిని ఎంపిక చేసినట్లు సమాచారం. తాజాగా మరో స్టార్‌ నటుడు కార్తీ కూడా ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో యాడ్‌ అవుతున్నట్లు తెలిసింది. త్వరలో సెట్‌ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్న ఆ పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రం గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

మరిన్ని వార్తలు