మణిరత్నంగారు నన్ను పూర్తిగా మార్చేశారు!

21 Mar, 2017 23:00 IST|Sakshi
మణిరత్నంగారు నన్ను పూర్తిగా మార్చేశారు!

హీరో కార్తీ

‘‘ఏ స్కూల్‌లో నేను సినిమా గురించి నేర్చుకున్నానో ఆ స్కూల్‌లో మళ్లీ యాక్టింగ్‌ నేర్చుకున్నా. అన్నయ్య (సూర్య) లేదా లియోనార్డో డికాప్రియో చేయాల్సిన పాత్ర. నాకెందుకు సార్‌? అనడిగా. కానీ, మణిరత్నంగారు నన్ను పూర్తిగా మార్చేశారు. హీరోగా ఓ పదేళ్ల తర్వాత నాకు క్యారెక్టర్‌ మీద కొంచెం కమాండ్‌ వచ్చినట్టుంది’’ అన్నారు కార్తీ. మణిరత్నం దర్శకత్వంలో కార్తీ, అదితీరావ్‌ హైదరి జంటగా నటించిన తమిళ సినిమా ‘కాట్రు వెలియిడై’ను తెలుగులో ‘చెలియా’ పేరుతో ‘దిల్‌’ రాజు విడుదల చేస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచిన ఈ సినిమా ఆడియో సీడీలను చిత్రపాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి విడుదల చేశారు.

కార్తీ మాట్లాడుతూ – ‘‘మణిరత్నంగారు ఎంతో పరిశోధన చేసి, ఈ కథ రాశారు. నేనూ ఫ్లయింగ్‌ క్లాసులకు వెళ్లాను. ఇందులో ఫైటర్‌ పైలట్‌గా నటించా. 200 కోట్ల మెషీన్, 72 పారామీటర్స్‌... ఆర్మీ ఎయిర్‌ఫోర్స్‌ను కంట్రోల్‌ చేయడం ఎంతో కష్టం. పైలట్‌ షార్ప్‌గా ఉండాలి. ఈ పాత్రకు కనీసం పది శాతం న్యాయం చేసినా.. నేను గొప్ప ఘనత సాధించినట్టే. ఇది వార్‌ ఫిల్మ్‌ కాదు... ప్రేమకథే’’ అన్నారు. ‘‘ఈ చిత్రానికి రెహమాన్, సీతారామశాస్త్రిగారు స్ట్రాంగ్‌ పిల్లర్స్‌. ఈ మ్యూజిక్‌ ఇంత స్పెషల్‌గా ఉందంటే వీళ్లే కారణం’’ అన్నారు మణిరత్నం. ‘‘తమిళ చిత్రాన్ని తెలుగులో అనువదించినప్పుడల్లా ఇక్కడి పాటలే నచ్చుతాయి. బహుశా.. తెలుగు భాష గొప్పదనం అనుకుంటా’’ అన్నారు ఏఆర్‌ రెహమాన్‌. సుహాసిని మాట్లాడుతూ – ‘‘మణిరత్నాన్ని ‘మీకు కథ, డైలాగులు రాయడం.. షాట్‌ పెట్టడం వచ్చా?’ అని అడుగుతాను. నేను ఆయన్ను ప్రశంసించడం కష్టం. కానీ, ప్రేక్షకులు ప్రశంసిస్తారు. ఆయన మళ్లీ మళ్లీ ప్రేమకథలే ఎందుకు తీస్తారో తెలీదు. దానికి కారణం మాత్రం నేను కాదు.

ఆయనెప్పుడూ హీరోకి ఈజీ క్యారెక్టర్‌ ఇవ్వరు. ఎన్ని హింసలున్నాయో అన్నీ పెడతారు. అవన్నీ దాటుకుని నటించాలి. ఈ సినిమాలో కార్తీ, అదితీలు ఆయన్ను డామినేట్‌ చేశారు’’ అన్నారు. అదితీరావ్‌ హైదరీ మాట్లాడుతూ – ‘‘నేను హెదరాబాదీ అమ్మాయినే. చిన్నప్పుడు ‘బొంబాయి’లో ‘కెహనాహై క్యా..’ పాట చూసేదాన్ని. అలాంటి పాటలో నటించాలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది’’ అన్నారు. ఇటీవల ‘దిల్‌’ రాజు సతీమణి అనితారెడ్డి మరణించడంతో ఆయన ఈ వేడుకకు రాలేదు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ‘దిల్‌’ రాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

http://img.sakshi.net/images/cms/2017-03/71490117295_Unknown.jpgవంశీ పైడిపల్లి, కార్తీ, అదితీరావ్‌ హైదరి, సుహాసిని, మణిరత్నం, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, ఎ.ఆర్‌. రెహమాన్, కిరణ్‌