ఇదే నాకు పెద్ద బర్త్‌డే గిఫ్ట్‌

21 Nov, 2019 08:53 IST|Sakshi

ఇది తనకు పెద్ద బర్త్‌డే గిఫ్ట్‌ అని అన్నారు నటుడు అరుణ్‌ విజయ్‌. విషయం ఏమిటంటే మంగళవారం  ఈయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా అరుణ్‌ విజయ్‌ నటిస్తున్న సినమ్‌ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఆవిష్కరించారు. ఈయన తన చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఆవిష్కరించడమే తన పుట్టినరోజుకు పెద్ద గిఫ్ట్‌ అని అరుణ్‌ విజయ్‌ పేర్కొన్నారు. సినమ్‌ చిత్ర యూనిట్‌ కూడా చాలా ఖుషీగా ఉంది. చిత్ర కథానాయకుడు అరుణ్‌ విజయ్‌ మాట్లాడుతూ.. మణిరత్నం తన చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఆవిష్కరించడం చాలా సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. అంతే కాకుండా ఇది చిత్ర ప్రచారానికి బలాన్నిచ్చే అంశం అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో తానింతకు ముందు సెక్క సివంద వానం చిత్రంలో నటించడం మరిచిపోలేని అనుభవం అని అన్నారు. ఆయన దర్శకత్వంలో నటనలో కొత్త కోణాన్ని నేర్చుకున్నానని చెప్పారు. గత ఏడాది పుట్టిన రోజు ఎలాగైతే తనకు అద్భుతంగా జరిగిందో అదే విధంగా ఈ పుట్టిన రోజు కొనసాగుతుందని భావిస్తున్నానన్నారు. 

అందుకు సినమ్‌ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మణిరత్నం చేతుల మీదగా విడుదల చేయడమే కారణం అన్నారు. ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఒక పోలీస్‌ అధికారి కోపం ఎన్ని ఆటంకాలను ఎదిరించి న్యాయం కోసం పోరాడాల్సి వస్తుందని చెప్పే చిత్రమే సినమ్‌ అని తెలిపారు. ఇలాంటి కథాంశంతో ఇంతకు ముందు పలు చిత్రాలు వచ్చినా దర్శకుడు జీఎన్‌ఆర్‌.కుమారవేలన్‌ కథను వివరించిన విధానం తెరపై ఆవిష్కరించిన తీరు తనకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తోందన్నారు. కాగా సినమ్‌ చిత్ర షూటింగ్‌ సెట్‌లో అరుణ్‌విజయ్‌ పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. అరుణ్‌ విజయ్‌ తండ్రి విజయ్‌కుమార్, తల్లితో పాటు, సహోదరి ప్రీతి, అగ్నిసిరగుగళ్‌ చిత్ర దర్శకుడు నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మా క్రియేషన్స్‌ శివ నటుడు అరుణ్‌విజయ్‌కు బంగారు గొలుసును బహుమతిగా అందించారు. కాగా  ఇందులో పలాక్‌ లాల్వాణి హీరోయిన్‌గా నటిస్తుండగా కాళీవెంకట్‌ చాలా ప్రాధాన్యత కలిగిన పాత్రలో నటిస్తున్నారు. షబీర్‌ సంగీతాన్ని, గోపీనాథ్‌ ఛాయాగ్రహణను అందిస్తున్నారు.   

మరిన్ని వార్తలు