చెడు ప్రవర్తనతోనే జీవితం అంధకారం

4 Jan, 2019 10:29 IST|Sakshi

సినిమా: ఏదైనా అనుభవంలోకి వస్తేగానీ తెలియదంటారు. చాలా మంది పాశ్చాత్య సంస్కృతి పేరుతో విచ్చలవిడి ప్రవర్తనతో జీవితాన్ని ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అది తప్పని తెలిసే సరికి పరిస్థితి చెయ్యి దాటిపోతుంది. ఇది సినిమా వాళ్లకూ వర్తిస్తుంది. ఉదాహరణకు నటి మనీషా కోయిరాలానే తీసుకుంటే ఈ నేపాలీ బ్యూటీ హిందీ,  తమిళం, తెలుగు అంటూ పలు భాషల్లో నటించి 1990లో క్రేజీ కథానాయకిగా వెలిగింది. ముఖ్యంగా తమిళంలో బొంబాయి, ఇండియన్, ముదల్వన్, బాబా వంటి పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి అందమైన నటి కేన్సర్‌ వ్యాధికి గురైంది. ఆ వ్యాధితో తీవ్రంగా పోరాడి ఎట్టకేలకు జయించింది.

మనీషాకోయిరాలా కేన్సర్‌ మహమ్మారి బారిన పడటానికి కారణం విచ్చల విడి ప్రవర్తన, కట్టుబాట్లను మీరడమే. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పుకుంది. కేన్సర్‌ వ్యాధి నుంచి కోలుకున్న మనీషాకోయిరాలా తన జీవిత చరిత్రను పుస్తకంగా రాసుకుంది. ‘హీల్డ్‌’ పేరుతో రాసిన ఆ పుస్తకంలో... ‘కేన్సర్‌ నాకు జీవితంలో చాలా ధైర్యాన్నిచ్చింది. నా చెడు ప్రవర్తన కారణంగానే కేన్సర్‌ వ్యాధి బారిన పడ్డాను. నేను పలు చీకటి రోజులను, ఏకాంత రాత్రులను గడిపాను. వాటి నుంచి ఎలా బయట పడ్డానన్నది తలచుకుంటే నాకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకప్పుడు ప్రపంచమే నా కాలు కింద ఉందని విర్రవీగాను. క్షణం తీరక లేని షూటింగ్‌ల కారణంగా 1999లో శారీరకంగానూ, మానసికంగానూ బాధింపునకు గురయ్యాను. అందులోంచి బయట పడటానికి మద్యం ఒక్కటే మంచి మార్గం అని భావించాను. శ్రేయోభిలాషులు ఎంత హితబోధ చేసినా పెడ చెవిన పెట్టాను. కేన్సర్‌ నా జీవితంలో ఒక బహుమతిగానే వచ్చిందని నేను అనుకుంటున్నాను. నా ఆలోచనలు మారాయి. నా మనసుకు బోధ పడింది. నా దృక్పథంలో మార్పు వచ్చింది. ఇంతకు ముందు చాలా కోపంగానూ, అభద్రతాభావంతోనూ ఉండేదాన్ని. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటున్నాను అని మనీషా కోయిరాలా పేర్కొంది. 

మరిన్ని వార్తలు