నా బలం తెలిసింది

18 Jan, 2020 01:52 IST|Sakshi

కొంతకాలం కెమెరాకు దూరంగా ఉన్నారు హీరోయిన్‌ మంజిమా మోహన్‌. ఇటీవల ఓ ప్రమాదంలో ఆమె కాలికి గాయం కావడమే ఇందుకు కారణం.  మంజిమా కోలుకుని తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. అయితే ఈ కోలుకునే క్రమంలో ఆమె అనుభవాలను ఓ పోస్ట్‌ ద్వారా షేర్‌ చేశారు. ఆ పోస్ట్‌ సారాంశం ఇలా...   ‘‘నేను గాయపడి ఇంట్లో ఉన్న ఖాళీ సమయంలో నాలో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. అవి నన్ను ఆందోళనకు గురి చేశాయి. మళ్లీ మామూలుగా నడవగలనా? నాకు ఎంతో ఇష్టమైన నటనకు దూరం అవుతానా? నేను ప్రేమించే డ్యాన్స్‌ను వదులుకోవాల్సి వస్తుందా? అనే ఆలోచనలు నన్ను కంగారు పెట్టాయి. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు ధైర్యం చెప్పినప్పటికీ కొన్ని సందర్భాల్లో నాపై నాకు నమ్మకం ఉండేది కాదు.

భయం వేసింది.  అప్పుడు నాకు చికిత్స చేస్తున్న డాక్టర్‌ ‘నీపై నీకు నమ్మకం ఉంటేనే ఏదైనా సాధించగలవు. నువ్వు ఈ సమస్య నుంచి సురక్షితంగా బయటపడగలవు’ అని చెప్పి మళ్లీ నాలో కొత్త ఉత్తేజాన్ని నింపారు. మెల్లిగా నా పనులు నేను చేసుకోవడం మొదలుపెట్టాను. మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నాను. ఈ అనుభవం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నా బలం ఏంటో నాకు తెలిసేలా చేసింది. ఇప్పుడు నా ఆలోచనల్లో భయం, ఆందోళన, అనుమానాలకు చోటు లేదు. గతంలో ఎందరో నటీనటులు నాలానే గాయపడి తిరిగి కోలుకున్నారు. వారి  ధైర్యాన్ని ఎంతో గౌరవిస్తున్నాను’’ అని పేర్కొన్నారు మంజిమా మోహన్‌. నాగచైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు మంజిమా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా