విక్రమ్‌తో రొమాన్స్‌కు రెడీ

12 Dec, 2016 14:26 IST|Sakshi
విక్రమ్‌తో రొమాన్స్‌కు రెడీ

సియాన్‌ విక్రమ్‌తో రొమాన్స్‌ చేయడానికి మాలీవుడ్‌ బ్యూటీ మంజిమామోహన్‌ రెడీ అవుతున్నారన్నది తాజా వార్త. ఈ అమ్మడికి కోలీవుడ్‌లో అవకాశాలు వరస కడుతున్నాయి. మలయాళంలో ఒకటి రెండు చిత్రాలు చేసిన కథానాయికలకు కోలీవుడ్‌లో మంచి గిరాకీ ఏర్పడడం అన్నది చాలా కాలం నుంచే జరుగుతోంది. అసిన్, నయనతార లాంటి వారంతా ఈ కోవకు చెందిన వారే. తాజాగా మంజిమామోహన్‌ చేరారు.శింబుకు జంటగా అచ్చంఎన్భదు మడమైయడా చిత్రంతో తమిళ చిత్రరంగ ప్రవేశం చేసిన మంజిమామోహన్‌ను ఆదిలోనే చాలా మంది భయపెట్టారు. అయినా ధైర్యం చేసి ఆయనతో నటించడానికి సిద్ధమయ్యారు.

ఆ చిత్రం కూడా పలు ఆటంకాల మధ్య చిత్రీకరణను పూర్తి చేసుకోవడంతో మంజిమామోహన్‌ గురించి రకరకాల ప్రచారం జరిగింది. అచ్చంఎన్భదు మడమైయడా చిత్రం షూటింగ్‌లో ఉండగానే విక్రమ్‌ప్రభుకు జంటగా ముడిచూడమన్నన్‌ చిత్రంలో నటించే అవకాశం రావడంతో టక్కున ఆ చిత్రాన్ని అంగీకరించారు. శింబు చిత్రం షూటింగ్‌ జాప్యం కావడంతో మంజిమామీనన్‌కు ముడిచూడ మన్నన్‌ చిత్రమే మొదట విడుదలవుతుందనుకున్నారు. అయితే గౌతమ్‌మీనన్, శింబుల మధ్య మనస్పర్థలు తొలగడంతో అచ్చంఎన్భదు మడమైయడా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ముందుగా తెరపైకి వచ్చి మంచి ప్రజాదరణ పొందింది. తొలి చిత్రమే శుభారంభాన్నివ్వడంతో మంజిమామోహన్‌ లక్కీ నాయకి అయిపోయారు. అంతే కాదు శింబు చాలా స్వీట్‌ పర్సన్‌ అంటూ ఒక స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం ముడిచూడ మన్నన్‌ చిత్రంతో పాటు గౌరవ్‌ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్‌తో ఒక చిత్రం చేస్తున్నారు. తాజాగా సియాన్‌ విక్రమ్‌తో నటించే లక్కీఛాన్స్‌ మంజిమామోహన్‌ను వరించింది.

ఇరుముగన్‌ వంటి విజయవంతమైన చిత్రం తరువాత విక్రమ్‌ వాలు చిత్రం ఫేమ్‌ విజయ్‌చందర్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో హీరోయిన్‌ ఎవరన్న ప్రశ్నకు కీర్తీసురేశ్, సాయిపల్లవి, మంజిమామోహన్‌ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే కీర్తీసురేశ్‌ ఇప్పటికే చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. నటి సాయిపల్లవి అడిగిన పారితోషికం దర్శక నిర్మాతలకు ముచ్చెమటలు పట్టించిందట. చివరిగా విక్రమ్‌తో నటించే అవకాశం నటి మంజిమామోహన్‌ను వరించింది. దీంతో నటి కీర్తీసురేశ్‌కు మంజిమామోహన్‌ పోటీగా తయారవుతున్నారనే టాక్‌ కోలీవుడ్‌లో హాట్‌హాట్‌గా సాగుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా