‘మన్మథుడు 2‌‌’ మూవీ రివ్యూ

9 Aug, 2019 12:40 IST|Sakshi

టైటిల్ : మన్మథుడు 2
జానర్ : రొమాంటిక్‌ కామెడీ
తారాగణం : నాగార్జున, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, వెన్నెల కిశోర్‌, లక్ష్మీ, రావూ రమేష్‌
సంగీతం : చైతన్‌ భరద్వాజ
దర్శకత్వం : రాహుల్‌ రవీంద్రన్‌
నిర్మాత : నాగార్జున, పి. కిరణ్‌

వయసు పెరుగుతున్న కొద్ది మరింత గ్లామర్‌గా రెడీ అవుతూ నిజంగానే మన్మథుడు అనిపించుకుంటున్నాడు కింగ్‌ నాగార్జున. ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే కింగ్, తాజాగా ‘ఐ డూ’ అనే ఫ్రెంచ్‌ రొమాంటిక్‌ కామెడీని తెలుగులో రీమేక్‌ చేశాడు. చిలసౌ సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మరోసారి మన్మథుడుగా అలరించే ప్రయత్నం చేశాడు నాగ్‌. మరి ఈ ప్రయత్నం ఆకట్టుకుందా..? రాహుల్ దర్శకుడిగా మరో విజయాన్ని అందుకున్నాడా..?

కథ :
సామ్‌ అలియాస్ సాంబశివ రావు (నాగార్జున అక్కినేని) పోర్చుగల్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి. తను ప్రేమించిన అమ్మాయి దూరం కావటంతో ప్రేమంటేనే అబద్ధమని కేవలం తన ఆనందం కోసం మాత్రమే బతకాలని నిర్ణయించుకుంటాడు. పెళ్లి చేసుకోవాలని విసిగిస్తున్నారని కుటుంబానికి కూడా దూరంగా ఉంటుంటాడు. వయసు మీద పడటంతో సామ్ తల్లి (లక్ష్మీ).. కొడుకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. కుటుంబమంతా కలిసి మూడు నెలలో పెళ్లి చేయాలని తీర్మానం చేస్తారు.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అవంతిక (రకుల్‌ ప్రీత్‌ సింగ్‌) అనే అమ్మాయిని తన ప్రియురాలిగా కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తాడు. సరిగ్గా పెళ్లి రోజున చెప్పకుండా వెళ్లిపోవాలని అవంతికతో అగ్రిమెంట్‌ చేసుకుంటాడు. తన సమస్యల కారణంగా అవంతిక కూడా అగ్రిమెంట్‌కు అంగీకరిస్తుంది. అలా ఇంటికి వచ్చిన అవంతిక, సామ్‌ కుటుంబ సభ్యులకు దగ్గరవుతుంది. మరి అవంతిక అగ్రిమెంట్ ప్రకారం సామ్‌ ఫ్యామిలీని వదిలి వెళ్లిపోయిందా..? ప్లేబాయ్‌ లా లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్న సామ్‌ మారాడా.. లేదా? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
తన వయసును అంగీకరిస్తూ చేసిన సామ్‌ పాత్రలో నాగ్‌ సూపర్బ్ అనిపించాడు. లవర్‌ బాయ్‌లా కనిపిస్తూనే తన ఏజ్‌ను కూడా గుర్తు చేశాడు. తన మార్క్‌ రొమాంటిక్‌ సీన్స్‌లో వావ్ అనిపించిన నాగ్‌, ఎమోషనల్‌ సీన్స్‌లో కంటతడిపెట్టించాడు. ఇప్పటికీ తాను మన్మథుడినే అంటూ ప్రూవ్‌ చేసుకున్నాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. ఇండిపెండెంట్‌ అమ్మాయిగా కనిపిస్తూనే ప్రేమ, బాధ, కామెడీ ఇలా అన్ని ఎమోషన్స్‌ను పండించింది. వెన్నెల కిశోర్‌ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో కితకితలు పెట్టాడు. సినిమా అంతా హీరో వెంటే కనిపించే పాత్రలో కడుపుబ్బా నవ్వించాడు. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయిన రావూ రమేష్‌ తన మార్క్‌ చూపించాడు. ఇతర పాత్రలో లక్ష్మీ, ఝూన్సీ, దేవ దర్శిని తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అతిథి పాత్రల్లో కీర్తి సురేష్‌, సమంతలు తళుక్కుమన్నారు.


 
విశ్లేషణ :
‘చిలసౌ’ సినిమాతో ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్‌ రెండో సినిమానే మన్మథుడు 2 లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేసే చాన్స్‌ సాధించాడు. అక్కినేని అభిమానులు నాగార్జునను ఎలా చూడాలనుకుంటారో అలాగే చూపించాడు రాహుల్‌. నాగార్జున లోని కామెడీ యాంగిల్‌ను చాలా బాగా ఎలివేట్‌ చేశాడు. అక్కడక్కడ మసాలా డైలాగ్స్‌ కాస్త శ్రుతిమించినట్టుగా అనిపించినా కథలో భాగంగా ఓకే అనిపిస్తాయి. భారీ ఎమోషనల్‌ సీన్స్‌, పిండేసే సెంటిమెంట్స్‌ లేకుండా సినిమా అంతా ఓ ఫన్‌ రైడ్‌లో నడిపించాడు. ఫస్ట్‌ హాఫ్‌లో కామెడీ బాగానే వర్క్‌ అవుట్ అయినా కొన్ని బోరింగ్ సీన్స్‌ ఇబ్బంది పెడతాయి. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం పరవాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి సినిమాకు మేజర్‌ప్లస్‌ పాయింట్‌. నాగ్‌ను మన్మథుడిలా చూపించిన ఎమ్‌ సుకుమార్‌‌.. పోర్చుగల్‌ అందాలను అద్భుతంగా కెమెరాల్లో బందించి ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.


ప్లస్‌ పాయింట్స్‌ :
నాగార్జున
కామెడీ
కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :
ఫస్ట్ హాఫ్‌

సతీష్‌ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్‌ డెస్క్‌.

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా