ఖిలాడీ ఐడియా గురూ..!!

27 Aug, 2016 11:50 IST|Sakshi
ఖిలాడీ ఐడియా గురూ..!!

‘తాప్సీ బేబీ యాక్షన్ భలే ఇరగదీసింది బాసూ’ - హిందీ సినిమా ‘బేబీ’ చూసిన తర్వాత ప్రేక్షకులతో పాటు విమర్శకులూ చెప్పిన మాట ఇది. అక్షయ్ కుమార్ హీరోగా నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బేబీ’. అందాల బొమ్మగా మాత్రమే కాదు, అవకాశం వస్తే యాక్షన్ సీన్లలోనూ తడాఖా చూపగలనని ‘బేబీ’తో తాప్సీ నిరూపించుకున్నారు. గతేడాది విడుదలైన ఈ సినిమాలో తాప్సీ పాత్ర (ప్రియా) నిడివి తక్కువే అయినప్పటికీ, యాక్షన్ గాళ్‌గా మంచి పేరొచ్చింది.
 
  ఇప్పుడీ సినిమాకి ప్రీక్వెల్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా ఓ హిట్ సినిమాకి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ తీస్తే, హీరో క్యారెక్టర్ బేస్ చేసుకుని తీస్తుంటారు. ‘బేబీ’లో తాప్సీ యాక్షన్ చూసిన తర్వాత ప్రియా క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని ప్రీక్వెల్ తీస్తే బాగుంటుందని అక్షయ్ కుమార్ స్వయంగా దర్శకుడు నీరజ్ పాండేకి ఐడియా ఇచ్చారట. ఈ ఖిలాడీ కుమార్ ఇచ్చిన ఐడియాతో ఫీమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమా కోసం రచయిత శివమ్ నాయర్ కథ రాయడం ప్రారంభించారు.
 
  ఈ చిత్రానికి నీరజ్ పాండే, శివమ్ నాయర్‌లలో ఎవరో ఒకరు దర్శకత్వం వహిస్తారట. ‘మీరా’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్, మలయాళ నటుడు పృథ్వీ హీరోలుగా నటించనున్నారని బి-టౌన్ టాక్. అక్షయ్ కుమార్ అతిథి పాత్రలో కనిపిస్తారట. ‘బేబీ’ కోసం తాప్సీ ఇజ్రాయెల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రీక్వెల్ కోసం మార్షల్ ఆర్ట్స్‌లో కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకునే పనిలో పడ్డారట.