ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను: నటుడు

2 Jul, 2020 10:40 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అకాల మరణాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో పలువురు నటీనటులు ఒకానొక సమయంలో తాము కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు వెల్లడించారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి అవార్డ్‌ విన్నింగ్‌ నటుడు మనోజ్ బాజ్‌పేయి‌ కూడా చేరారు. హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబేకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ సామన్య రైతు కుటుంబంలో పుట్టిన పిల్లాడు నటుడిగా ఎదిగిన క్రమాన్ని చెప్పుకొచ్చారు. ఈ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న కష్టాలను, విమర్శలను వెల్లడించారు. వీటన్నింటిని భరించలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు మనోజ్ బాజ్‌పేయి తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

తొమ్మిదేళ్ల వయసులో కల కన్నాను
‘నేను ఓ సాధారణ రైతు కొడుకును. బిహార్‌లోని ఓ చిన్న గ్రామంలో జన్మించాను. మేం ఐదుగురు తోబుట్టువులం ఓ గుడిసెలో నడిచే స్కూల్‌లో చదువుకున్నాం. పట్టణం వెళ్లేవరకు నాది సాధారణ జీవితమే. అయితే నా తొమ్మిదో ఏట మొదటి సారి పట్నం వెళ్లాను. థియేటర్‌లో సినిమా చూశాను. అమితాబ్‌ బచ్చన్‌ అంటే ఆరాధన పెరిగింది. నేను తనలానే కావాలని నిర్ణయించుకున్నాను. నటనే నా జీవిత గమ్యం అని నాకు తెలిసింది. అయితే అది ఎంత కష్టమైన కలో నాకు తెలుసు. అందుకే చదువు కొనసాగించాను. కానీ నా బుర్ర మాత్రం దేని మీద ఏకాగ్రత కుదరనిచ్చేది కాదు. దాంతో నా 17వ ఏట డీయూ వెళ్లాను. అక్కడ థియేటర్‌లో చేరాను. దీని గురించి నా కుటుంబానికి ఏం తెలియదు. చివరకు మా నాన్నకు ఉత్తరం రాశాను. అయితే ఆయన నా కోరికను అర్థం చేసుకున్నారు. నా మీద కోప్పడలేదు. ఫీజు కట్టడం కోసం రూ.2 వేలు పంపారు’ అని గుర్తు చేసుకున్నారు మనోజ్ బాజ్‌పేయి. (ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందన్నాడు)

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను
‘నేను పెరిగిన వాతావరణానికి.. ఇక్కడి పరిస్థితులు పూర్తిగా భిన్నం. ఇక్కడ నేను బయట వ్యక్తిని. ఇందులో ఇమడాలని ప్రయత్నిస్తున్నాను. అందుకే ఇంగ్లీష్‌, హిందీ, భోజ్‌పూరి భాషలను నేర్చుకున్నాను. నేను వాటిల్లో మాట్లాడటం ఇంకా పెద్ద పరీక్ష. అప్పుడు నేను ఎన్‌ఎస్‌డీకి అప్లై చేశాను. కానీ మూడు సార్లు తిరస్కరించారు. చాలా బాధపడ్డాను. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. విషయం తెలిసి నా స్నేహితులు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఒంటరిగా వదిలేవారు కారు. రాత్రి నాతో పాటే పడుకునేవారు. పరిస్థితులను అంగీకరించే దాక వారు నాకు తోడుగా ఉన్నారు. ఆ ఏడాది టిగ్మాన్షు తన ఖతారా స్కూటర్‌లో నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నేను చాయ్ షాపులో ఉన్నాను. అతడు వచ్చి శేఖర్ కపూర్ నన్ను ‘బండిట్‌ క్వీన్’‌లో నటింపజేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. సరే అని చెప్పి వెంటనే ముంబైకి బయల్దేరాను’ అన్నారు మనోజ్ బాజ్‌పేయి. (బై ముంబై.. వెళ్లిపోతున్నా: హీరోయిన్‌)

ఒక్క రోజే 3 ప్రాజెక్ట్‌ల్లోంచి తీసేశారు
ఆయన మాట్లాడుతూ.. ‘ముంబై వెళ్లిన తొలి నాళ్లలో చాలా కష్టపడ్డాను. ఐదుగురితో కలిసి ఒక గది అద్దెకు తీసుకున్నాను. పని కోసం ఎదురు చూసేవాడిని. అవకాశాలు లేవు. ఒకసారి ఓ కంపెనీ నా ఎదురుగానే ఫోటోలు చించేసింది. ఒకే రోజు నన్ను మూడు ప్రాజెక్ట్‌ల్లోంచి తీసేశారు. ఓ సన్నివేశం షూటింగ్‌ పూర్తికాగానే వెళ్లిపొమ్మని చెప్పిన వాళ్లు కూడా ఉన్నారు.  నా ముఖం హీరోకు సూట్‌ కాదని.. నేను బిగ్‌ స్క్రీన్‌పై పనికిరానని వారు భావించారు. అవకాశాలు లేక.. చేతిలో డబ్బు లేక చాలా ఇబ్బంది పడ్డాను. అద్దే కట్టడం కాదు కదా.. కనీసం పావ్‌బాజీ తినాలన్నా చాలా ఖరీదైన విషయంగా అనిపించేది. అయితే నా ఆకలిమంటలు.. విజయాన్ని చేరడానికి అడ్డంకి కాలేదు. 4 సంవత్సరాల పోరాటం తరువాత, నాకు మహేష్ భట్ టీవీ సిరీస్‌లో ఓ అవకాశం వచ్చింది. ప్రతి ఎపిసోడ్‌కు నాకు రూ .1500 ఇచ్చేవారు. అదే నా మొదటి స్థిరమైన ఆదాయం. ఆ తర్వాత నాకు మొదటి చిత్రం ఆఫర్ దొరికింది. ఆ తర్వాత ‘సత్య’ తో పెద్ద బ్రేక్‌ వచ్చింది’ అన్నారు. 

‘ఆ తర్వాత అవార్డులు వచ్చాయి. నేను  ఇళ్లు కొన్నాను. నేను ఇక్కడే ఉన్నాను. 67 సినిమాల తరువాత, ఇప్పుడు కూడా నేను ఇక్కడ నేను ఉన్నాను. ఇక కలల విషయానికి వస్తే.. వాటిని నిజం చేసుకునే ప్రయత్నంలో వచ్చే కష్టాలను నేను పట్టించుకోలేదు.  తొమ్మిదేళ్ల బిహార్‌ కుర్రాడి కల మాత్రమే ఇక్కడ స్థిరంగా నిలిచింది’ అన్నారు మనోజ్ బాజ్‌పేయి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా