ఇదేనా మేక్‌ ఇన్‌ ఇండియా పథకం?

4 Aug, 2018 09:17 IST|Sakshi

తమిళసినిమా: పెద్ద నోట్ల రద్దు తరువాత సినిమా నాశనం, వ్యవసాయం నాశనం. అంతా నాశనం ఇదేనా కేంద్రప్రభుత్వ మేక్‌ ఇన్‌ ఇండియా పథకమా అంటూ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ఆవేశంగా ప్రశ్నించారు. ఇంతకు ముందు గ్యాస్‌ పథకం ద్వారా వ్యవసాయానికి, రైతులకు కలిగే నష్టం గురించి చర్చించిన తెరు నాయ్‌గళ్‌ చిత్రాన్ని నిర్మించిన ఐ క్రియేషన్స్‌ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం పడిత్తవుడన్‌ కిళిత్తు విడవుమ్‌. తెరు నాయ్‌గళ్‌ చిత్ర దర్శకుడు హరి ఉత్రనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ మాట్లాడుతూ సాధారణంగా తానే ఏ సినిమా కార్యక్రమంలో పాల్గొన్నా చిత్రం బాగుంది, పాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి లాంటివి మాట్లాడనన్నారు.

అయితే ఈ చిత్ర టైటిల్‌ చూడగానే చిత్ర యూనిట్‌ ధైర్యాన్ని తెలుపుతుందన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు పథకానికి ముందు తమిళసినిమానే కాకుండా దక్షిణాది సినిమా బాగుందన్నారు. నోట్ల రద్దు తరువాత 500 మంచి చిన్న నిర్మాతలు కనిపించకుండా పోయారన్నారు. అదే విధంగా జంతు సంరక్షణ అనే సమాఖ్య ఏ జంతువుతోనూ సినిమా తీయకుండా చేస్తోందన్నారు. ఒక చిత్ర ప్రమోషన్‌ కోసం ఆడియో ఆవిష్కరణ, టీజర్‌ విడుదల వంటి కార్యక్రమాలు నిర్వహించి చిత్రంలో ఆసక్తికరమైన విషయాలను తెలిపి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించుకుంటున్నామన్నారు. అలాంటిది సడన్‌గా 8 రోడ్డు పథకాన్ని ప్రారంభిస్తున్నామంటోంది ప్రభుత్వం అని అన్నారు. దాన్ని ఎవరు అడిగారు? దాని అవసరం ఏమిటి? అందువల్ల ఎవరికి ఉపాధి కలుగుతుంది. ఎవరికి ప్రయెజనం? వంటివి వివరించాలిగా అన్నారు. సినిమాకు ప్రేక్షకులను రప్పించుకునే విధంగా ప్రభుత్వం 8 రోడ్ల పథక నిర్మాణం గురించి ఎందుకు వివరించడం లేదూ అని ప్రశ్నించారు.

దీనికి బదులివ్వని ఈ ప్రభుత్వం ఎంతపనికి మాలినదంటే రూ.10 వేలకోట్లు వస్తుందని గ్రీన్‌వేస్‌ పథకం కోసం ఆరాటపడుతోందని ధ్వజమెత్తారు. కైవై, చిరువాణిల నీటిని ప్రయివేట్‌ సంస్థలకు అమ్ముకోవాలని ప్రయత్నిస్తోందన్నారు.ఆ తరువాత గాలి, ఆక్సిజన్‌ కూడా అమ్ముకుంటుందని అన్నారు. ఆపై తల్లి పాలను లీటర్ల లెక్కన పిల్లలకు అందించే ప్రయత్నం చేస్తుందని దుయ్యపట్టారు. తమిళన్‌ మెలకువతో ఉండగానే అతని ప్యాంటును ఊడదీయాలని చూస్తోందన్నారు. తమిళుడంటే అంత అలుసైపోయ్యిందన్నారు. ప్రశ్నిస్తే ఇదంతా కేంద్రప్రభుత్వ పథకం అని అంటున్నారన్నారు. అప్పుడు నువ్వు ఉన్నదెందుకు ఉల్లిపాయలు అమ్ముకోవడానికా? వెంట్రుకలు పీక్కోవడానికా? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రూ.7 లక్షల కోట్లలో ఏం ఖర్చు చేశారు? అందులో 5 పైసలు సాధారణ ప్రజలకు అందిందా? సినిమా నాశనం, వ్యవసాయం నాశనం. అంతా నాశనం ఇదేనా కేంద్ర ప్రభుత్వ మేక్‌ ఇన్‌ ఇండియా పథకమా? అంటూ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు