ఆయన చేతికి చిక్కితే అంతే!

16 Jul, 2018 07:53 IST|Sakshi

తమిళసినిమా: నటుడు మన్సూర్‌అలీఖాన్‌ చేతికి చిక్కితే ప్రాణాలతో బయటపడడం అసాధ్యమే. అంత దుర్మార్గుడా? అంతే చెప్పడం కష్టమే. అది తెలియాలంటే కడమాన్‌పారై చిత్రం చూడాల్సిందే. మన్సూర్‌ అలీఖాన్‌ తన రాజ్‌కెనడీ ఫిలింస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కడమాన్‌ పారై. అంతే కాదు ఈ చిత్రం ద్వారా ఆయన తన కొడుకు అలీఖాన్‌ తుగ్లక్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. అనురాగవి హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో మరో హీరోయిన్‌గా జెన్నీఫెర్నాండెజ్‌ నటిస్తోంది. శివశంకర్, ,చార్మి, దేవీజేజూ, బ్లాక్‌పాండి, అముదవానన్, ముల్‌లై, కోదండం, పళనీ, కనల్‌కన్నన్, బోండామణి, పయిల్‌వాన్‌ రంగనాథన్, లొల్లుసభ మనోహర్, వెంగళరావ్, ఆదిశివన్, విచిత్రన్, కూల్‌సురేశ్‌ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

చిత్ర వివరాలను దర్శకనిర్మాత మన్సూర్‌అలీఖాన్‌ తెలుపుతూ కళాశాల విద్యార్థిలిప్పుడు దారి తప్పుతున్నారన్నారు. అమ్మ, నాన్న, ఉపాధ్యాయుడు ఎవరు చెప్పినా వారు లెక్క చేయకుండా పెడ దారి పడుతున్నారని, అలాంటి ఒక యువప్రేమ జంట కాలేజ్‌కు డుమ్మా కొట్టి ఒక కొండ ప్రాంతానికి వెళతారని తెలిపారు. అక్కడ గంగువారెడ్డి కొండ, గంజ కొండ పాంత్రాలను తన ఆధీనంలో ఉంచుకున్న సూరప్పన్‌ అనే ఆదివాసి(మన్సూర్‌అలీఖాన్‌) చేతిలో చిక్కుకుంటారని తెలిపారు. అతని చేతిలో చిక్కితే ఫారెస్ట్‌ రేంజర్‌ అయినా ప్రాణాలతో బయట పడలేడని అన్నారు. అంతే కాదు ఆ కొండ ప్రాంతాల్లోని చందన కట్టెలను, ఖనిజ వనరులను ఎవరూ దొంగిలించలేరని చెప్పారు. అలా అక్కడి కనిజ వనరులను కాపాడే సూరప్పన్‌ నుంచి ఈ ప్రేమజంట బయట పడగలిగారా లేదా అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం కడమాన్‌ పారై చిత్రం అని తెలిపారు. ఈ చిత్ర షూటింగ్‌ను ఆంధ్రా రాష్ట్రంలోని దట్టమైన అడవుల్లోనూ, పాండిచ్చేరి, చెన్నైలోనూ నిర్వహించినట్లు చెప్పారు. దీనికి రవివర్మ సంగీతాన్ని, టి.మహేశ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల స్థానిక నుంగంబాక్కంలోని తన కార్యాలయంలో నిర్వహించారు.

మరిన్ని వార్తలు