నా జీవితం ఓ కథలాంటిది: మానుషి

16 Nov, 2019 11:09 IST|Sakshi

రాణి సంయోగితగా మానుషి చిల్లర్‌

ముంబై : ప్రపంచ మాజీ సుందరి మానుషి చిల్లర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఎట్టకేలకు ఖరారైంది. ఐశ్వర్యారాయ్‌, ప్రియాంక చోప్రా మాదిరి మానుషి కూడా సినిమాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. 2017లో భారత్‌కు ప్రపంచ సుందరి కిరీటం సాధించి పెట్టిన ఈ అందాల రాశి చారిత్రక చిత్రంతో బీ-టౌన్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తొలి చిత్రంతోనే ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌కు జోడిగా నటించే అవకాశం దక్కించుకున్నారు. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ‘పృథ్వీరాజ్‌’ సినిమాలో చక్రవర్తి ప్రేమికురాలు రాణి సంయోగితగా ఆమె కనిపించనున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం ముంబైలో జరిగాయి. 

ఈ క్రమంలో సినీ రంగప్రవేశం గురించి మానుషి(22) మాట్లాడుతూ... చారిత్రక చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ సినిమాలో భాగస్వామ్యం కావడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. ‘ నా జీవితం అంతా ఓ అందమైన ఓ కథలాంటిది. మిస్‌ ఇండియా నుంచి మిస్‌ వరల్‌‍్డ దాకా సాగిన ప్రయాణంలో ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు సినిమాల్లోకి రావడం ద్వారా కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నాను. రాణి సంయోగితగా నటించడం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. భారత దేశ చరిత్రలో తనకంటూ కొన్ని పుటలు లిఖించుకున్న ఆమె పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను. మీ ఆశీర్వాదాలు కావాలి’ అని పేర్కొన్నారు. ఇక సినిమా దర్శకుడు చంద్రప్రకాశ్‌ ద్వివేది మాట్లాడుతూ.. సంయోగిత పాత్ర కోసం అందమైన, విశ్వాసం కలిగిన అమ్మాయి కోసం వెదికాం. ఆ లక్షణాలు మాకు మానుషిలో కనబడ్డాయి. అందుకే ఆమెను ఎంపిక చేశాం అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు