సరోజ్‌ ఖాన్‌ మృతి తీరని లోటు: గుణశేఖర్‌ 

4 Jul, 2020 04:11 IST|Sakshi

‘‘ప్రముఖ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్‌ మృతి భారతీయ సినిమాకే తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’’ అన్నారు దర్శకుడు గుణశేఖర్‌. చిరంజీవి హీరోగా గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ‘చూడాలని ఉంది’ సినిమాలోని ‘ఓ మారియా.. ఓ మారియా..., అబ్బబ్బా ముద్దు..’ పాటలకు సరోజ్‌ ఖాన్‌ నృత్యరీతులు సమకూర్చారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుణశేఖర్‌ గుర్తు చేసుకుంటూ– ‘‘1998లో వచ్చిన ‘చూడాలని ఉంది’ సినిమా కోసం సరోజ్‌ ఖాన్‌గారితో కలిసి పనిచేశా. ‘ఓ మారియా.. ఓ మారియా’ పాటను సరోజ్‌ ఖాన్‌గారితో చేద్దామనుకుంటున్నానని నిర్మాత అశ్వినీదత్‌ గారికి చెప్పగానే, నేను వెళ్లి మాట్లాడతానని చెప్పారు. అప్పటికి ఇండియాలోనే బిజీ కొరియోగ్రాఫర్‌ అయినప్పటికీ చిరంజీవిగారి సినిమా అనగానే ఎగ్జయిట్‌ అయ్యి ఒప్పుకున్నారామె. ఎందుకంటే చిరంజీవిగారు కొరియోగ్రాఫర్స్‌ తాలూకు ఎఫర్ట్‌ని తన డ్యాన్స్‌ మూమెంట్స్‌తో వందరెట్లు ఎక్కువ చేస్తారు.

నేను, మణిశర్మ సినీ కెరీర్‌ ప్రారంభించిన తొలి రోజులు అవి. పాట వినగానే మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరు? అని సరోజ్‌ ఖాన్‌గారు అడిగారు. మణిశర్మ అనే అప్‌కమింగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అన్నాను. ఆ రిథమ్స్‌ నచ్చి, తను భవిష్యత్తులో పెద్ద సంగీత దర్శకుడు అవుతాడన్నారు. పాటల కోసం తోట తరణిగారు వేసిన సెట్‌ని బాగా లైక్‌ చేశారు. ‘చూడాలని ఉంది’ నా నాలుగో సినిమా. కెరీర్‌ తొలినాళ్లలోనే మెగాస్టార్‌గారితో సినిమా అంటే అదొక అచీవ్‌మెంట్‌. క్యాస్టింగ్, కెమెరా, ఆర్ట్‌ మీద నేను పెట్టిన శ్రద్ధని ఆమె మెచ్చుకొని నన్ను చాలా ప్రోత్సహించారు. ‘ఓ మారియా.. ఓ మారియా’ పాటని మా టీమ్‌ ఎంజాయ్‌ చేస్తూ చేశాం. ఆ పాటను ప్రేక్షకులు మాకంటే ఎక్కువ ఎంజాయ్‌ చేశారు. ఆ పాటకి సరోజ్‌ ఖాన్‌గారికి నంది అవార్డు కూడా వచ్చింది. ఆమె డ్యాన్స్‌ మూమెంట్స్‌ని ఎంత బాగా కంపోజ్‌ చేస్తారో ఎక్స్‌ప్రెషన్స్‌ని కూడా అంతే బాగా క్యాప్చర్‌ చేస్తారు. దాంతో ‘అబ్బబ్బా ముద్దు..’ పాటను కూడా ఆమెతోనే కొరియోగ్రఫీ చేయించాం. ఆ పాటలో సౌందర్యగారి ఎక్స్‌ప్రెషన్స్‌కి, చిరంజీవిగారి గ్రేస్‌ మూమెంట్స్‌కి ప్రేక్షకులు మరోసారి అంతే గొప్ప అనుభూతికి లోనయ్యారు. ఆ పాట అప్పటికి ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది.. ఆ ట్రెండ్‌ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పటికే లెజెండరీ కొరియోగ్రాఫర్‌ అయిన సరోజ్‌ ఖాన్‌గారు కొత్తవారికి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది’’ అన్నారు.

ప్రముఖ నృత్యదర్శకురాలు సరోజ్‌ ఖాన్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తపరిచారు
► ఒక శకం ముగిసింది. ఇండస్ట్రీలోకి రాబోతున్న కొత్తతరం వారికి ఆమె ప్రతిభ ఓ ప్రేరణలా ఉంటుంది. – మహేశ్‌బాబు

► ఒక లెజెండరీ కొరియోగ్రాఫర్‌ ఇక లేరు. ఆమె నా తొలి కొరియోగ్రాఫర్‌ (చిరంజీవి ‘డాడీ’లో అల్లు అర్జున్‌ ఓ డ్యాన్స్‌ సీక్వెన్స్‌లో కనిపిస్తారు). ఎంతో విలువైన ఓ వజ్రంలాంటి వ్యక్తిని భారతీయ సినీ పరిశ్రమ కోల్పోయింది. – అల్లు అర్జున్‌

► ఎంతో సునాయాసంగా డ్యాన్స్‌ చేయగల గొప్ప ప్రతిభావంతురాలు సరోజ్‌ ఖాన్‌గారు. ‘మేరా పతీ సిర్ఫ్‌ మేరా హై’ చిత్రంలో ఆమెతో కలిసి పని చేశాను. తన ఊహల్లోని విజువల్స్‌లోకి యాక్టర్స్‌ను తీసుకెళ్లగల ఆమె శైలి గొప్పది. – రాధికా శరత్‌కుమార్‌

► సరోజ్‌ ఖాన్‌గారి మరణవార్త నా హృదయాన్ని ముక్కలు చేసింది. నేను చేసిన, నాకు నచ్చిన, నేను డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసిన ఎన్నో పాటల వెనక దాగి ఉన్న ఓ లెజెండ్‌ సరోజ్‌ మేడమ్‌. ఇండస్ట్రీకి ఆమె చేసిన కృషి ఎప్పటికీ నిలిచిపోతుంది.  – వేదిక 

► సరోజ్‌ ఖాన్‌గారి మరణవార్త విని నా హృదయం బద్దలైంది. ఆమె డ్యాన్స్‌ మూమెంట్స్‌ నాకెంతో స్ఫూర్తినిచ్చాయి. – తమన్నా

► సరోజ్‌ఖాన్‌ జీతో కలిసి పనిచేయడాన్ని ఓ అదృష్టంగా భావిస్తున్నాను. – ప్రియమణి

► సినిమాలోని పాత్ర కోసం ఒక డ్యాన్సర్‌గా డ్యాన్స్‌లో మునిగి ఎలా మైమరచిపోవాలో నాకు గంటలకొద్దీ పాఠాలు చెప్పారామె. సినిమా పరిశ్రమలో నా తొలి గురువు సరోజ్‌ ఖాన్‌. నన్నెంతో ప్రేమగా చూసుకున్న ఆమె నాకెంతో ప్రత్యేకం. ఆమె ఆత్మకు అల్లా దీవెనలు ఉండాలి. – షారుక్‌ ఖాన్

► సరోజ్‌ ఖాన్‌ మనతో లేరనే చేదు వార్తతో శుక్రవారం నిద్రలేచాను. ఆమె శిక్షణలో చాలా ఈజీగా ఎవరైనా డ్యాన్స్‌ చేయొచ్చని నిరూపించారు. సరోజ్‌ ఖాన్‌ మరణం బాలీవుడ్‌ చిత్రపరిశ్రమకు తీరని లోటు.
– అక్షయ్‌కుమార్‌

► ఒక చరిత్ర అంతరించిపోయింది. సరోజ్‌ ఖాన్‌ మరణం వ్యక్తిగతంగా నాకు చాలా పెద్ద నష్టం. మన ముక్తా ఆర్ట్స్‌ (సుభాష్‌ నిర్మాణ సంస్థ) ఫ్యామిలీ అంతా నువ్వే ఉన్నావు. మాధురీ దీక్షిత్, మీనాక్షీ శేషాద్రి, మనీషా కొయిరాల, ఐశ్వర్యా రాయ్‌లు స్టార్స్‌గా ఎదగటానికి నాతో పాటు నువ్వు ఎప్పుడూ ఉన్నావు. డ్యాన్స్‌ ఉన్నంతకాలం భారతీయ చిత్ర పరిశ్రమలో బతికే ఉంటావు. – సుభాష్‌ ఘాయ్‌

► సరోజ్‌జీ.. నాతో పాటు ఎంతోమంది మిమ్మల్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈ పరిశ్రమలోకి వచ్చాం. మీ డ్యాన్స్‌  నైపుణ్యానికి అభినందనలు. – ఫరాఖాన్

► నిద్ర లేవటంతోనే ఇంతటి హృదయవిదారకమైన బాధను మోయాల్సి వస్తుందనుకోలేదు. మీ మరణవార్త విని తట్టుకోలేకపోయాను. మీకు మీరే ఒక శిక్షణాలయం లాంటివారు. మన డ్యాన్సర్స్‌ అందరికీ మీ మరణం చాలా పెద్ద లాస్‌. మీ శిష్యుల్లో ఒకడిగా, మీతోపాటు డ్యాన్సర్‌గా, మీతో కొరియోగ్రాఫర్‌గా, మీరు కొరియోగ్రాఫర్‌గా నేను డైరెక్టర్‌గా మిమ్మల్ని డైరెక్ట్‌ చేయటం.. ఇవన్నీ నా జీవితంలో జరిగిన అద్భుతాలు. డ్యాన్స్‌ చేసేటప్పుడు మీ కళ్లల్లో కనబడిన మెరుపు వృత్తిపట్ల మీకున్న ప్రేమను తెలియజేసేది. మీ దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. అందుకే మిమ్మల్ని, మీ జ్ఞాపకాలను నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను. – రెమో డిసౌజా

► డ్యాన్స్‌లో నా ప్రతిభను పూర్తి స్థాయిలో ప్రదర్శించటానికి నాకెంతో సాయం చేసిన సరోజ్‌ ఖాన్‌ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ఓ అగ్రశ్రేణి ప్రతిభాశాలిని భారతీయ సినిమా పరిశ్రమ కోల్పోయింది.
– మాధురీ దీక్షిత్‌

► మీతో పనిచేసే అవకాశం నాకు దక్కినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు. అది నా అదృష్టం. మీరు లేని లోటుని భర్తీ చేసే బలాన్ని మీ కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. – జెనీలియా

► మీ డ్యాన్స్‌ డైరెక్షన్‌లో డ్యాన్స్‌ చేయటం ప్రతి ఒక్క నటి కల. వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాను సరోజ్‌జీ. – కాజల్‌ అగర్వాల్‌

► ‘చూడమ్మా.. నీకేం కావాలో అది సాధించాలంటే దాని మీద దృష్టి సారించి నీ ప్రతిభను మొత్తం ప్రదర్శించు’’ అని ఓ సందర్భంలో మీరు (సరోజ్‌ ఖాన్‌) నాతో అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
– హన్సిక

► దేవుడా.. ఈ ఏడాది ఇక ఏ విషాద వార్తనూ ఇవ్వొద్దని కోరుకుంటున్నాను. మీ కొరియోగ్రఫీలో ఒక్క పాట అయినా చెయ్యాలని కలలు కనేదాన్ని. అది నెరవేరనందుకు బాధగా ఉంది. – రకుల్‌ప్రీత్‌ సింగ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు