సినిమా రివ్యూ: మేరి కోమ్

5 Sep, 2014 15:46 IST|Sakshi
సినిమా రివ్యూ: మేరి కోమ్

నటీనటులు: ప్రియాంక చోప్రా, దర్శన్ కుమార్, సునీల్ థాపా, మీనాక్షి కలితా, శిశిర్ శర్మ
సంగీతం: శశి-శివమ్
ఫోటోగ్రఫీ: కీకో నకహర
ఎడిటింగ్: రాజేశ్ జి. పాండే, సంజయ్ లీలా భన్సాలీ
నిర్మాత: వయాకామ్ 18 మోషన్ పిక్చర్
డైరెక్టర్: ఒమంగ్ కుమార్
క్రియేటివ్ డైరెక్టర్: సంజయ్ లీలా భన్సాలీ


ప్లస్ పాయింట్స్:
ప్రియాంక చోప్రా యాక్టింగ్
ఫోటోగ్రఫీ
మ్యూజిక్

మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే

ఇటీవల కాలంలో భారతీయ సినిమా పరిశ్రమలో క్రీడల నేపథ్యం, జీవిత కథల ఆధారంగా రూపొందిన 'లగాన్', 'చక్ దే ఇండియా', 'భాగ్ మిల్కా భాగ్', 'పాన్ సింగ్ తోమార్' చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. గత చిత్రాలు అందించిన ప్రోత్సాహంతో భారత బాక్సర్ మేరీ కోమ్ జీవిత కథ ఆధారంగా ఆమె పేరుతో నిర్మించిన చిత్రం శుక్రవారం సెప్టెంబర్ 5 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ క్రీడాభిమానులు ఆకట్టుకున్న మేరీ కోమ్ పాత్రలో ప్రియాంక చోప్రా సినీ ప్రేక్షకులను ఆలరించిందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు కథలోకి...

భారత దేశంలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లోని ఓ కుగ్రామంలోని పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఓ యువతి... తనకు ఎదురైన అన్ని అడ్డంకులు జయించి బాక్సింగ్ క్రీడలో అంతర్జాతీయ ఛాంపియన్ గా మేరి కోమ్ ఎలా మారింది. అలాగే వైవాహిక జీవితం తర్వాత మళ్లీ బాక్సింగ్ రింగ్ లోకి దూకి, క్రీడా సంస్థల అవమానాలను, అనేక ఆటుపోట్లను అధిగమించి.. విమర్శకులకు ఎలాంటి సమాధానమిచ్చిందనే కథాంశమే మేరి కోమ్ చిత్రం.

తాను అనుకున్న లక్ష్యం కోసం తండ్రిని ఎదురించమే కాకుండా అనేక కష్టాలను ఎదురించి అంతర్జాతీయ క్రీడాకారిణిగా మారిన ఓ సామాన్య యువతి పాత్రలో ప్రియాంక చోప్రా కనిపించింది. మేరి కోమ్ పాత్రలో ప్రియాంక జీవించిందనే చెప్పవచ్చు.. ప్రతి సన్నివేశంలోనూ తనదైన మార్క్ నటనతో ఆకట్టుకుంది. మేరి కోమ్ జీవితంలో ఎదురైన ఉద్వేగ భరిత క్షణాలకు తెరమీద అద్భుతంగా మెప్పించింది. ఓ క్షణంలో మేరి కోమ్ పాత్రను ఆమె తప్ప మరొకరు చేయరేమో అనే ఫీలింగ్ ను క్రియేట్ చేయడంలో ప్రియాంక చోప్రా సఫలమైంది. ప్రియాంక చోప్రా కెరీర్ లోనే అత్యుత్తమ పాత్రను పోషించింది. మేరి కోమ్ ను ఉత్తమ చిత్రంగా మలచడానికి ప్రియాంక 'వన్ ఉమెన్ ఆర్మీ' మారింది.  కోచ్ పాత్రలో సునీల్ థాపా గుర్తుండి పోయే పాత్రను షోషించారు.

ఇక సాంకేతిక విభాగానికి వస్తే ..

కీకో నకహర అందించిన ఫోటోగ్రఫీ ప్రేక్షకుడిని కథలో లీనం చేయడానికి తోడ్పాటునందించింది. ఈశాన్య రాష్ట్రాల్లోని సహజసిద్దమైన అందాలను నకహర తన కెమెరాలో బంధించిన తీరు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ.  శశి-శివమ్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. జిద్ది దిల్, సలామ్ ఇండియా, తేరి బారీ పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

వైవాహిక జీవితం తర్వాత  బాక్సింగ్ క్రీడకు దూరమైన తర్వాత మేరికోమ్ అనుభవించిన క్లిష్ట పరిస్థితులు, తన గురించి పత్రికలు గొప్పగా రాసిన పేపర్ పై కుమారుడు మూత్రం పోయడంలాంటి సన్నివేశాలు దర్శకుని ప్రతిభకు అద్దం పట్టాయి.  మణిపూర్ అంటే ఏదేశంలో ఉంది అని అడగటం, క్రీడాకారుల పట్ల ఆయ  సంఘాలు తీరు,  మహిళా క్రీడాకారులను ఎలా వేధింపులకు గురి చేస్తున్నారనే అంశాలు తెరకెక్కించిన తీరు ప్రేక్షకులు చేత చప్పట్టు కొట్టించాయి. ఓ గొప్ప చాంఫియన్ పేరున్న మేరి కోమ్.. గర్భం దాల్చిన తర్వాత తాను ఇక బాక్సింగ్ దూరమయ్యాననే ఆవేదనతో భర్తతో 'నీవు బాగా ఫుట్ బాల్ అడుతావు. నా జీవితమే త్యాగం చేయాల్సి వస్తోంది అనే సీన్ బ్రహ్మండంగా పండింది.

అయితే తొలిసారి దర్శకత్వం వహించిన ఒమాంగ్ కుమార్ అనుభవ రాహిత్యం స్పష్టం కనిపించింది. భావోద్వేగాలను తెరకెక్కించడంలో దర్శకుడిగా విఫలయ్యారనే చెప్పవచ్చు. ప్రేక్షకుడు ఊహించిన విధంగానే కథ నడవడం, కథనంలో వేగం లోపించడం, ఎలాంటి ట్విస్ట్ లేకుండా స్క్రీన్ ప్లే ఉండటం కొంత నిరాశకు గురిచేసే అంశం.

చివరగా:
మేరి కోమ్ జీవితంలో చీకటి, వెలుగులు, కష్టా నష్టాలు, ఉద్విగ్న క్షణాలను తెరపై చూపించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం చూడటం ద్వారా స్పూర్తి పొంది దేశంలోని కోట్లాది మంది ప్రజల నుంచి మరో 'మేరి కోమ్' అవతరిస్తే చాలు ఈ చిత్రం లక్ష్యాన్ని చేరుకున్నట్టే అని చెప్పవచ్చు.

-రాజబాబు అనుముల