‘షో’ సినిమాలా అవార్డులు, ‘మిస్సమ్మ’లా డబ్బులు రావాలి

24 Jun, 2014 01:10 IST|Sakshi
‘షో’ సినిమాలా అవార్డులు, ‘మిస్సమ్మ’లా డబ్బులు రావాలి

‘‘నీలకంఠ సినిమాలు కొత్త తరహాలో ఉంటాయి. ఈ సినిమా కథాంశం కూడా కొత్తగానే ఉంటుందని చెప్పొచ్చు. నీలకంఠ దర్శకత్వం వహించిన ‘షో’ సినిమాలా అవార్డులు, ‘మిస్సమ్మ’లా డబ్బులు ఈ చిత్రం తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిన్న సినిమా ఆడియోలకు అండగా నిలబడుతున్న ‘మధుర’ సంస్థ అధినేత శ్రీధర్ అంటే నాకు అభిమానం’’ అని దర్శకుడు వీవీ వినాయక్ చెప్పారు. నీలకంఠ దర్శకత్వంలో షిర్డిసాయి కంబైన్స్ పతాకంపై డా. ఏమ్వీకే రెడ్డి, ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘మాయ’.

శేఖర్‌చంద్ర స్వరపరచిన ఈ చిత్రం పాటలను హీరో ‘అల్లరి’ నరేశ్ ఆవిష్కరించి, మల్టీ డైమన్షన్ సంస్థకు చెందిన వాసుకు ఇచ్చారు. మరో అతిథి తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ -‘‘నీలకంఠలానే ఆయన సినిమాలు కొద్దిగా స్లోగా ఉంటాయి. కానీ, ఈ చిత్రం ట్రైలర్ స్పీడ్‌గా ఉంది కాబట్టి, ట్రెండ్ మార్చాడనిపిస్తోంది. ఎప్పుడూ కొత్త కథలతోనే ఆయన సినిమాలు చేస్తాడు’’ అన్నారు. ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ, ‘‘కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.

నేను ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ తీసిన తర్వాత, మంచి కాన్సెప్ట్‌తో సినిమా తీయాలనుకుంటున్న తరుణంలో నీలకంఠ ‘మాయ’ కథ చెప్పారు. నా బలం, నీలకంఠ దర్శకత్వం తోడైతే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లొచ్చనే నమ్మకంతో చేశాం’’ అని చెప్పారు. వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఎమోషనల్ థ్రిల్లర్ ఇదని, ఇది కొత్త తరహా సినిమా అని, అనుకున్నట్లుగా సినిమా బాగా రావడానికి చిత్రబృందం అందించిన సహకారమేనని చెప్పారు నీలకంఠ. ఇంకా ఈ వేడుకలో లగడపాటి శ్రీధర్, బెక్కం వేణుగోపాల్, సిరాశ్రీ, సందీప్ కిషన్, రఘు కుంచె, శేఖర్‌చంద్ర, హర్షవర్ధన్ రాణె, అవంతిక తదితరులు పాల్గొన్నారు.