రజనీ సినిమాలో మీనా, కీర్తి సురేశ్‌..!

4 Dec, 2019 10:58 IST|Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజా చిత్రం దర్బార్‌. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి పాటను ఇటీవలే విడుదల చేయగా.. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రజనీ తదుపరి చిత్రం తలైవార్‌ 168 సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్తలు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. రజనీ తదుపరి సినిమాను తామే నిర్మిస్తున్నామని సన్‌ పిక్చర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంతిరన్‌, పేట వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్ల తర్వాత ఈ కాంబినేషనన్‌లో రూపొందనున్న తలైవార్‌ 168కు శివ దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఈ చిత్రంలో సీనియర్‌ నటి మీనా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 

అంతేకాదు గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో రజనీ కూతురుగా కీర్తి సురేష్‌, భార్యగా ఖుష్బూ నటించనున్నారంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి. అయితే మూవీ యూనిట్‌ మాత్రం ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. రెండు నెలలుగా ప్రీ ప్రొడక‌్షన్‌ పనుల్లో నిమగ్నమైన చిత్రబృందం.. కమెడియన్‌ సూరి మాత్రం రజనీతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నట్లు పేర్కొంది. ఈ విషయం గురించి సూరి మాట్లాడుతూ... రజనీతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలన్న తన కల నిజమైందని సంతోషం వ్యక్తం చేశాడు. సూపర్‌స్టార్‌తో ఇంతవరకు సెల్ఫీ తీసుకునే అవకాశం రాలేదని.. ఇప్పుడు ఆయన పక్కన కనిపించే అదృష్టం వరించిందంటూ ఓ వీడియోను విడుదల చేశాడు. ఇక రజనీ- మీనా కాంబినేషన్‌లో తెరకెక్కిన ముత్తు సినిమా హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే విధంగా కథానాయకుడు సినిమాలోనూ వీరిద్దరూ తెరను పంచుకున్నారు. 
 

మరిన్ని వార్తలు