ఇది మనందరి అదృష్టం 

30 Oct, 2019 02:25 IST|Sakshi

 చిరంజీవి

‘‘కళాకారుల ప్రతిభకు అవార్డులు, రివార్డులే కొలమానాలు’’ అన్నారు చిరంజీవి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లండన్‌లోని భవన్స్‌ ప్రాంగణంలో సంగీత వేడుక జరిగింది. సంగీతంలోని విశిష్టమైన 72 మేళకర్త రాగాలను ఏకధాటిగా 61గంటల 20 నిమిషాల పాటు వీణవాదన చేసి గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు తెలుగు సినిమా సంగీత దర్శకుడు వీణాపాణి. ఈ సందర్భంగా వీణాపాణిని సత్కరించిన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఇటువంటి కళాకారులను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా గౌరవించడం మన సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం. ఇంత గొప్ప గౌరవం దక్కటం తెలుగువారితో పాటు భారతీయులందరి అదృష్టం’’ అన్నారు. ‘‘వీణపాణి అసలు పేరు రమణమూర్తి. ఆయనకు వీణాపాణి అని నామకరణం చేసింది నేనే అని గర్వంగా చెప్పగలను’’ అన్నారు తనికెళ్ల భరణి. ‘‘మన తెలుగువాడు ఇంతటి కీర్తిని సాధించడం మనకు గర్వ కారణం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. ‘‘వీణాపాణి ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’’ అన్నారు జనార్థన మహర్షి. ‘‘నా దర్శకత్వంలో వచ్చిన ‘పట్టుకోండి చూద్దాం’ ద్వారా సంగీత దర్శకునిగా ప్రయాణం మొదలుపెట్టిన వీణాపాణికి గిన్నిస్‌ అవార్డు రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు శివ నాగేశ్వరరావు. ‘‘ఈ రికార్డును ఆ మహాత్మునికి అంకితం ఇస్తున్నాను. నన్ను 28ఏళ్లుగా భరిస్తున్న నా భార్యకు, పిల్లలకు కూడా ఈ అవార్డు చెందుతుంది’’ అన్నారు వీణాపాణి.

మరిన్ని వార్తలు