సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది

19 Jun, 2019 03:03 IST|Sakshi
కేయస్‌ రామారావు, చిరంజీవి, భీమనేని శ్రీనివాసరావు

 – చిరంజీవి

‘‘క్రికెట్‌ నేపథ్యంలో విభిన్న కథాంశంతో వస్తున్న చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. క్రీడల నేపథ్యంలో వచ్చే సినిమాలకి ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు. ఆటల నేపథ్యంలో తీసిన ప్రతి సినిమా ఘన విజయం సాధించింది. ఆ కోవలోనే ఈ సినిమా కూడా హిట్‌ అవుతుంది’’ అని చిరంజీవి అన్నారు. ఐశ్వర్యా రాజేష్, డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్‌ రాజు, ‘వెన్నెల’ కిషోర్‌ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. ‘ది క్రికెటర్‌’ అన్నది ఉపశీర్షిక. కె.ఎస్‌.రామారావు సమర్పణలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ఎ.వల్లభ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను మంగళవారం చిరంజీవి విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయికి వెళ్లి, ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించి, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే కథతో ఈ సినిమా ఉంటుంది. టీజర్‌ చూస్తుంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది. ఐశ్వర్యా రాజేష్‌ నాలుగైదు నెలలు క్రికెట్‌లో శిక్షణ తీసుకొని నటించారంటే, ఆ అమ్మాయికి ఉన్న డెడికేషన్‌ అది. తను ఎవరో కాదు.. మా కొలీగ్‌ రాజేష్‌ కూతురు.. కమెడియన్‌ శ్రీలక్ష్మీ మేనకోడలు. మన తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు కొరవడిపోతున్న ఈరోజుల్లో ఐశ్వర్యా రాజేష్‌ రావడం శుభపరిణామం. భీమనేనికి ఈ సినిమా ఓ మైలురాయిలా నిలుస్తుంది’’ అన్నారు.

‘‘క్రీడల నేపథ్యంలో ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చినా, స్క్రీన్‌ప్లే, సబ్జెక్ట్‌ పరంగా మా సినిమా విభిన్నమైంది. తమిళంలో హిట్‌ అయిన ఈ సినిమా తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు భీమనేని శ్రీనివాసరావు. కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ– ‘‘40 సంవత్సరాలుగా చిరంజీవికి, మా సంస్థకి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెల్సిందే. ఒక గొప్ప సినిమా అయిన మా ‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్‌ను లాంచ్‌ చేసిన చిరంజీవిగారికి ధన్యవాదాలు. ఇప్పుడున్న యూత్‌కి కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. ఎనర్జిటిక్‌గా ఉంటూనే మంచి ఎమోషనల్‌గా ఉండే ఒక రైతు కుటుంబానికి సంబంధించిన కథ. ఈ సంవత్సరం రాబోయే గొప్ప సినిమాల్లో కచ్చితంగా మా సినిమా ఒకటి’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.సునీల్‌కుమార్, లైన్‌ ప్రొడ్యూసర్‌: వి.మోహన్‌రావు.
 ∙కేయస్‌ రామారావు, చిరంజీవి, భీమనేని శ్రీనివాసరావు

మరిన్ని వార్తలు