జనతా కర్ఫ్యూకు మెగాస్టార్‌ మద్దతు

21 Mar, 2020 11:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు మెగాస్టార్‌ చిరంజీవి మద్దతు తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ వీడియోను విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే ఉండి జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని కోరారు. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి 24 గంటలు సేవా భావంతో పనిచేస్తున్న వైద్యులకు, నర్సులకు ఇతర ఆరోగ్య బృందానికి, స్వచ్ఛ కార్మికులకు, పోలీసులకు, ఆయా ప్రభుత్వాలకు హర్షాతిరేకాలు ప్రకటిస్తూ రేపు(ఆదివారం) సాయంత్రం చప్పట్లతో ధన్యవాదాలు తెలపాలన్నారు.

కొద్దిరోజుల క్రితం కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై మెగాస్టార్‌ ఓ వీడియాను విడుదల చేశారు. ఆ వీడియోలో ‘‘తుమ్మినా, దగ్గినా కర్చీఫ్‌ కానీ టిష్యూ పేపర్‌ను అడ్డు పెట్టుకోవడం తప్పనిసరి. ఒక్కసారి వాడిన టిష్యూ పేపర్‌ను మరోసారి వాడకుండా.. మూత ఉన్న చెత్త బుట్టలో వేయడం శ్రేయస్కరం. మీ చేతులను కళ్లకు, ముక్కుకు, నోటికి తగలకుండ జాగ్రత్త వహించండి. బయటకు వెళ్లినప్పుడు మీ దగ్గు, జలుబు ఇతరులకు సోకకుండా ముఖానికి మాస్క్‌లు ధరించండి. ఒకవేళ అలసట, నీరసం జ్వరం ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చేసే బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే ఎవరికీ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చెబుదా’’ మని అన్నారు. ( భయం, నిర్లక్ష్యం వద్దు: చిరంజీవి )

కాగా,  కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రోజున జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రజలంతా ఆరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఐదు నిమిషాల పాటు తమ ఇంట్లోనే ఉండి కరోనా నియంత్రణ కోసం శ్రమిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలపాలన్నారు. గుమ్మం ముందు, లేక బాల్కనీలో, లేక కిటికీ వద్ద నిల్చుని చప్పట్లు కొట్టడం, గంటలు కొట్టడం, సెల్యూట్‌ చేయడం లేదా వీలైన ఇతర విధానాల్లో వారికి కృతజ్ఞతలు తెలియజేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు