అందుకు మేము కారణం కాదు

31 Jan, 2020 08:06 IST|Sakshi

సినిమా: పటాస్‌ చిత్రంతో మరోసారి కోలీవుడ్‌లో వార్తల్లో ఉంటున్న నటి మెహ్రీన్‌. 2016లో నటిగా రంగప్రవేశం చేసిన జాణ ఈమె. అంటే అప్పుడే ఐదో ఏటను టచ్‌ చేసేసింది. ఈ ఐదేళ్లలో తెలుగు, తమిళం, మాతృభాష పంజాబీ అంటూ పలు భాషల్లో నటిస్తూ బాగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా తెలుగులో మంచి క్రేజ్‌నే సంపాదించుకుంది. పోతే తమిళంలో ఇటీవలే సక్సెస్‌ రుచిని చూసింది. ఇంతకుముందే సుశీంద్రన్‌ దర్శకత్వంలో నెంజిల్‌ తునివిరుందాల్‌ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడం కారణం కావచ్చు ఇక్కడ ఈ అమ్మడిని పెద్దగా పట్టించుకోలేదు. అలాంటిది దర్శకుడు దురై సెంథిల్‌కుమార్‌ కంటపడింది. దీంతో ధనుష్‌తో పటాస్‌ చిత్రంలో రొమాన్స్‌ చేసే అవకాశాన్ని దక్కించుకుంది.

అయితే ఈ సారి పటాస్‌ చిత్రం సక్సెస్‌ను, గుర్తింపును తెచ్చి పెట్టింది. కానీ మరిన్ని అవకాశాలను మాత్రం అందించలేదు. అందుకోసమేనేమో ఈ అమ్మడు తరచూ వార్తల్లో ఉండేలా చర్చనీయాంశ వ్యాఖ్యలు చేస్తోంది. చిత్ర అపజయాలకు తాము కారణం కాదని అంటోంది. మెహ్రీన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను నటించే ప్రతి చిత్రం విజయం సాధించాలని ఆశిస్తానని చెప్పింది. కథా పాత్రల్లో లీనమై అంకితభావంతో ప్రాణం పణంగా పెట్టి నటిస్తానని అంది. అయినా తాను నటించిన కొన్ని తెలుగు చిత్రాలు ఫ్లాప్‌ అయ్యి నిరాశకు గురిచేశాయని చెప్పింది. నిజం చెప్పాలంటే అపజయాలకు నటీనటులు కారణం కాదని అంది. ఆ చిత్రాల కథలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని, లేకుంటే ఎంతో శ్రమించి నటించినా వృధానే అని పేర్కొంది.

ఈ అమ్మడు అంతగా ప్రాణాన్ని పణంగా పెట్టి నటించిన చిత్రాలేమిటో గానీ, ఇటీవల తెలుగు, తమిళంలో నటించిన చిత్రాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. అయితే తెలుగులో కల్యాణ్‌రామ్‌కు జంటగా నటించిన ఎంత మంచి వాడివిరా చిత్రం సంక్రాంతికి విడుదలైంది. ఈ చిత్ర రిజల్ట్‌ పైనే మెహ్రీన్‌ అసంతృప్తిని వ్యక్తం చేస్తుందేమో. అయినా, ఎన్నో అనుకుంటాం.అన్నీ జరుగుతాయా ఏంటి? లైట్‌గా తీసుకోవాలిగానీ. ఇకపోతే తెలుగులో ఈ బ్యూటీ నటించిన అశ్వథ్థామ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఇది మినహా అక్కడ కూడా చేతిలో చిత్రాలు లేవు. అందుకే ఫ్రస్టేషన్‌లో ఈ అమ్మడు అలా మాట్లాడుతుందా అన్న భావన కలుగుతోందంటున్నారు సినీ వర్గాలు.

మరిన్ని వార్తలు