మేం వంద సినిమాలు చేయలేం

21 Aug, 2016 23:56 IST|Sakshi
మేం వంద సినిమాలు చేయలేం

 - గోపీచంద్
 ‘‘శ్రీకాంత్ అన్నయ్య ఆల్‌మోస్ట్ వంద చిత్రాలకు పైగా చేశారు. అన్ని సినిమాలు చేయడం నిజంగా గ్రేట్. ఇప్పుడు మేం వంద సినిమాలు చేయలేం. ఆయన సినిమాల్లో నాకు బాగా నచ్చినవి ‘ఖడ్గం’, ‘ఆపరేషన్ ధుర్యోదన’, ‘మహాత్మ’. నేను ‘మహాత్మ’ సినిమా చూసిన వెంటనే అన్నయ్యకు ఫోన్ చేసి చాలా బాగుంది, అద్భుతంగా నటించారని చెప్పా. అంతటి నటన, ఇంటెన్సిటీ నాకు ‘మెంటల్’ చిత్రంలో కనిపిస్తోంది. ఆ మూడు చిత్రాలకంటే ఈ ‘మెంటల్’ బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్ అన్నారు.
 
  శ్రీకాంత్, అక్ష జంటగా కరణం పి.బాబ్జీ(శ్రీను) దర్శకత్వంలో వీవీఎస్‌ఎన్‌వీ ప్రసాద్, వీవీ దుర్గాప్రసాద్ అనగాని నిర్మించిన చిత్రం ‘మెంటల్’. సాయి కార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని గోపీచంద్ విడుదల చేశారు. చిత్రదర్శకుడు మాట్లాడుతూ-‘‘మంచి పాటలిచ్చి సాయికార్తీక్ వంద శాతం న్యాయం చేశాడు. కొత్తవాడినైనా నేను చెప్పినట్లు శ్రీకాంత్‌గారు నటించారు’’ అని పేర్కొన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ-‘‘ఐ రెస్పెక్ట్ టు పోలీస్. మన సైనికులన్నా నాకు ఇష్టం. ఇటీవల కార్గిల్ వెళ్లొచ్చా. కచ్చితంగా ఈ చిత్రం పోలీసులకు గౌరవం తెచ్చేలా ఉంటుంది. సినిమా చూశాక నేను దర్శకుణ్ణి హగ్ చేసుకున్నా. అంత బాగా తీశాడు’’ అని చెప్పారు.