‘మెర్క్యూరి’ మూవీ రివ్యూ

13 Apr, 2018 12:55 IST|Sakshi

టైటిల్ : మెర్క్యూరి
జానర్ : సైలెంట్‌ హర్రర్‌ థ్రిల్లర్‌
తారాగణం : ప్రభుదేవా, సనంత్‌రెడ్డి, దీపర్‌ పరమేష్‌, శశాంక్‌ పురుషోత్తం, అనీష్‌ పద్మనాభన్‌, ఇందుజా, గజరాజ్‌
సంగీతం : సంతోష్‌ నారాయణన్‌
దర్శకత్వం : కార్తీక్‌ సుబ్బరాజ్‌
నిర్మాత : స్టోన్‌ బెంచ్‌ ఫిలింస్‌, పెన్‌ స్టూడియోస్‌

30 ఏళ్ల క్రితం కమల్‌ హాసన్‌ హీరోగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ‘పుష్పక విమానం’ పేరుతో ఓ మూకీ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు మరోసారి యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌ అదే ప్రయోగం చేశాడు. మూకీ హర్రర్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన మెర్క్యూరి సినిమాలో ప్రభుదేవా కీలక పాత్రలో నటించాడు. పిజ్జా, జిగర్తాండ, ఇరైవి లాంటి ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించిన కార్తీక్‌, ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు. మూడు దశాబ్దల తరువాత భారతీయ వెండితెర మీద సందడి చేసిన మూకీ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? గతంలో ఎన్నడూ కనిపించనంత కొత్త అవతారంలో కనిపించిన ప్రభుదేవ భయపెట్టడంలో సక్సెస్‌ అయ్యాడా..? కార్తీక్ మరోసారి తన మార్క్‌ థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌తో అలరించాడా..?

కథ :
కార్పొరేట్‌ ఎర్త్‌ అనే కంపెనీలో జరిగిన మెర్య్కూరి పాయిజనింగ్‌ కారణంగా ఆ దగ్గరలోని ఓ గ్రామంలో 84 మంది చనిపోతారు. అంతేకాదు ప్రమాదం కారణంగా ఎంతోమంది చిన్నారులు మూగ చెవిటి వారిగా, అంధులుగా పుడతారు. మెర్య్యూరి పాయిజనింగ్‌ కారణంగానే బధిరులైన నలుగురు కుర్రాలు, ఓ అమ్మాయి కాలేజ్‌ లో జరిగిన అలూమ్ని పార్టీ లో పాల్గొని తరువాత కొద్దిరోజులు ఫ్రెండ్స్‌ తో ఆనందంగా గడపడానికి అక్కడే ఉండిపోతారు. అలా ఫ్రెండ్స్‌తో సరదాగా ఎంజాయ్‌ చేస్తూ కారులో వెళ్తూ ఓ యాక్సిడెంట్‌ చేస్తారు. ఆ యాక్సిడెంట్‌లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి చనిపోతాడు. చనిపోయిన వ్యక్తిని అక్కడే వదిలేసి వెళ్తే పోలీసులు పట్టుకుంటారన్న భయంతో ఆ శవాన్ని మోర్య్కూరి పాయిజనింగ్‌ కు కారణమైన ఫ్యాక్టరిలో పడేస్తారు. తరువాత ఆ కుర్రాళ్లు అదే ఫ్యాక్టరికీ ఎందుకు వెళ్లారు..? వారు యాక్సిడెంట్‌ చేసి చంపేసిన వ్యక్తి ఎవరు..? ఆ కుర్రాళ్లు ఒక్కొక్కరుగా చనిపోవటానికి కారణం ఏంటి..? చివరకు ఎంత మంది మిగిలారు..? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ :
దాదాపు 30 ఏళ్ల తరువాత ఇండియన్‌ స్క్రీన్‌ మీద మూకీ సినిమాను చూపించిన కార్తీక్‌ సుబ్బరాజ్‌ ధైర్యాన్ని ప్రశంసించాల్సిందే. అది కూడా డ్యాన్సర్‌ గా, లవర్‌ భాయ్‌గా మంచి ఇమేజ్‌ ఉన్న ప్రభుదేవాను పూర్తిగా డిఫరెంట్‌ రోల్‌లో, డిఫరెంట్‌ గెటప్‌లో చూపించి మెప్పించాడు కార్తీక్‌. సందేశాత్మక అంశాన్ని హర్రర్‌ థ్రిల్లర్‌గా మలిచి ఆకట్టుకున్నాడు. అయితే రొటీన్‌ కమర్షియల్ సినిమాలో ఉండే అంశాలేవి లేకపోవటం, తొలి భాగంలో లీడ్‌ యాక్టర్స్‌ మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులకు అర్ధం కాకపోవటం లాంటివి కాస్త ఇబ‍్బంది పెడతాయి.

దర్శకుడు సృష్టించిన పాత్రకు ప్రభుదేవా వందశాతం న్యాయం చేశాడు. తనకు జరిగిన అన్యాయానికి పగతీర్చుకునే పాత్రలో ప్రభుదేవా నటన చాలా సందర్భాల్లో భయపెడుతుంది. అదే సమయంలో ప్రీ క్లైమాక్స్‌ ఎపిసోడ్స్‌లో కంటతడి కూడా పెట్టిస్తుంది. ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాకు మేజర్‌ ప్లస్ పాయింట్‌ సంతోష్ నారాయణన్‌ అందించిన నేపథ్య సంగీతం. ఒక్క డైలాగ్‌ కూడా లేని సినిమాను పూర్తిగా తన నేపథ్య సంగీతంతో ఆసక్తికరంగా మార్చాడు సంతోష్‌. తిరు అందించిన సినిమాటోగ్రఫి సినిమాలోని ఫీల్‌ ను క్యారీ చేసింది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
ప్రభుదేవా లుక్‌, నటన
కార్తీక్‌ సుబ్బరాజ్‌ టేకింగ్‌

మైనస్ పాయింట్స్ :
బధిరుల భాషలో చెప్పించిన సంభాషణలు అర్ధం కాకపోవటం
స్లో నేరేషన్‌


- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Poll
Loading...
మరిన్ని వార్తలు