కల నెరవేరింది

20 Jan, 2020 00:09 IST|Sakshi
యంజీఆర్‌ యానిమేషన్‌ చిత్రం

తమిళ ప్రఖ్యాత నవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ని సినిమాగా తీసుకురావాలన్నది దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి యంజీఆర్‌ (యంజీ రామచంద్రన్‌) కల. ఈ నవలను సినిమాగా తీయాలని పలుమార్లు ప్రయత్నించినప్పటికీ కుదర్లేదు. ఇప్పుడు యంజీఆర్‌ను యానిమేషన్‌ రూపంలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ రూపొందిస్తోంది చెన్నైకు సంబంధించిన శనీశ్వరన్‌ యానిమేషన్‌ స్టూడియో ఇంటర్నేషనల్‌. ఈ సంస్థే నిర్మాణాన్ని కూడా చూసుకుంటోంది. ‘వందియదేవన్‌: పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ పేరుతో ఈ భారీ బడ్జెట్‌ యానిమేషన్‌ చిత్రాన్ని దర్శకుడు దవచెల్వాన్‌ తెరకెక్కిస్తున్నారు.

  నాలుగేళ్లుగా ఈ సినిమాపై వర్క్‌ చేస్తోందట ఈ యానిమేషన్‌ స్టూడియో. ఇటీవల యంజీఆర్‌ జయంతి సందర్భంగా ఈ సినిమాలో తొలి పాటను విడుదల చేశారు. విశేషం ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా జయలలిత పాత్ర ఉండబోతోందట. ఆమె పాత్ర కూడా యానిమేషన్‌లోనే ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సంగతి అలా ఉంచితే ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు