కొత్త ప్రేమకథలో తనీష్, శ్రీ

6 Oct, 2014 23:37 IST|Sakshi
కొత్త ప్రేమకథలో తనీష్, శ్రీ

తనీష్, శ్రీ హీరోలుగా నటిస్తున్న ‘మీకో ప్రేమకథ చెప్పాలి’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. శివగణేశ్ దర్శకత్వంలో కూనిరెడ్డి శ్రీనివాస్, శివణేష్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి నూకారపు సూర్యప్రకాశరావు కెమెరా స్విచాన్ చేయగా, వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం కూనిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ -‘‘ఓ అద్భుతమైన కథతో శివగణేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘33 ప్రేమకథలు’ ఎంత వినూత్నంగా ఉంటుందో, ఈ చిత్రం కూడా అంతే కొత్తగా ఉంటుంది. ఇది చక్కని ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ’’ అని చెప్పారు. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గ కథతో ఈ చిత్రం ఉంటుందని, ప్రతి ఒక్కరికీ కనెక్ట్  అయ్యే కథ అని దర్శకుడు తెలిపారు. మూడు జంటల ప్రేమకథతో సాగే ఈ చిత్రంలో తనది మాస్ కారెక్టర్ అని శ్రీ చెప్పారు. ఈ చిత్రం తన కెరీర్‌కు మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం ఉందని తనీష్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాలిరెడ్డి, ఆర్ట్: భాస్కర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జయశంకర్.