మా అమ్మాయి పాట వింటే...ఎల్లారీశ్వరి గుర్తొచ్చింది!

12 Apr, 2015 00:45 IST|Sakshi
మా అమ్మాయి పాట వింటే...ఎల్లారీశ్వరి గుర్తొచ్చింది!

 ‘‘సినిమా నిర్మాణం అంత సులువు కాదని మహానటుడు శివాజీ గణేశన్ నాతో అనేవారు. ‘నటుడిగా సంపాదించిన డబ్బు జాగ్రత్త చేసుకో! చేతులు కాలితే ఎవరూ సహాయం చేయరు’ అనేవారాయన. నిర్మాణం అంత సులువు కాదని నాకు తెలుసు. కానీ, సినిమాలు నిర్మించాను. అయితే, నా బిడ్డ లక్ష్మి నిర్మాతగా చేస్తానంటే ప్రోత్సహించలేదు. అయినా చేసింది. ఈ చిత్రం రషెస్ చూశాను. అద్భుతమైన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నటుడు మోహన్‌బాబు అన్నారు. విద్యా నిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్. వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మీప్రసన్న నటించి, నిర్మించిన చిత్రం ‘దొంగాట’.
 
 అడివి శేష్, మధు నందన్ ముఖ్య పాత్రలు చేశారు. రఘు కుంచె, సాయి కార్తీక్, సత్య మహావీర్ పాటలు స్వరపరిచారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో పాటల సీడీని మోహన్‌బాబు ఆవిష్కరించారు. మోహన్‌బాబు ప్రసంగిస్తూ, ‘‘రామారావుగారు, నాగేశ్వరరావు, దాసరి గార్ల నుంచి ఎంతో క్రమశిక్షణ నేర్చుకున్నాను. ఇప్పటి తరంలో క్రమశిక్షణ లేదు. ఎవరో కొందరు మాత్రం క్రమశిక్షణగా ఉంటున్నారు. ఆ సంగతలా ఉంచితే, లక్ష్మిని చక్కగా చదువుకుని, గృహిణిగా స్థిరపడమని చెప్పాను. ఆమె బాగా చదువుకుంది. కానీ, సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఓ తండ్రిగా తనకు మంచి చిత్రాలు తీయమని చెప్పాను. మంచి సినిమాలు చేస్తోంది.
 
 వాస్తవానికి మా లక్ష్మి మంచి గాయని అయితే బాగుంటుందనుకున్నాను. ఎస్పీ బాలు, జేసుదాసు వంటి గాయకుల దగ్గర నా కోరిక చెబితే, ‘పాటలెందుకు? చక్కగా చదువుకొమ్మ’న్నారు. మద్రాసులో ఓ విద్వాంసుడు దగ్గర చేర్పిస్తే, పాటలు వదిలేసి, వంటలు నేర్చుకుంది. మొత్తం మీద గాయని కాలేదు. ఇప్పుడు ఈ చిత్రంలో తను పాడిన పాట విని, నమ్మలేకపోయాను. చాలా బాగా పాడింది. ఒకప్పుడు ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన ఎల్.ఆర్. ఈశ్వరి గొంతును గుర్తు చేసింది. నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘ఏ ఆర్టిస్ట్ ప్రతిభ అయినా బయటికొచ్చేది ప్రతినాయకుడిగా చేసినప్పుడే! భారతదేశంలో ప్రతినాయకుడిగా నేను ప్రదర్శించినన్ని హావభావాలు వేరే ఏ నటుడూ ప్రదర్శించలేదు’’ అన్నారు.
 
 లక్ష్మి మాట్లాడుతూ- ‘‘నేను సింగర్ కావాలని నాన్న చాలా తపన పడ్డారు. నేనేం చేసినా మా నాన్నగారు గర్వపడేలా చేయాలనుకుంటాను. ఈ పాట మా నాన్నను గర్వపడేలా చేస్తుందనుకుంటున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న కథానాయిక తమన్నా, మంచు కుటుంబంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘హీరోయిన్‌గా నేను పరిచయమైంది మోహన్‌బాబు గారి బ్యానర్‌లోనే. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం - ఈ కుటుం బమే. ఈ చిత్ర దర్శకుడు వంశీకృష్ణ నా తొలి చిత్రం ‘శ్రీ’ నాటి నుంచి తెలుసు’’ అన్నారు.  కె. రాఘవేంద్రరావు, విష్ణు, మనోజ్, సుమంత్, మధుశాలిని, దేవి, నిర్మల, అడివి శేష్ తదితరులు  పాల్గొన్నారు.