నెట్టే కదా అని తిట్టేయడమేనా!

29 Aug, 2018 00:06 IST|Sakshi

స్టాప్‌ ట్రోలింగ్‌

‘వెల్‌ డన్‌ అబ్బా’.. ఒక హిందీ సినిమా!‘ రాజుగారి చేపల చెరువు’ అనే సినిమాకు స్ఫూర్తి వెల్‌ డన్‌ అబ్బానే. ఆ సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన నటి మినిషా లాంబా. నటనంటే చచ్చేంత ఇష్టం ఆమెకు. అందుకే గ్లామర్‌ రోల్స్‌తో పాటు నటనకు అవకాశమున్న పార్లల్‌ మూవీస్‌లోనూ చేస్తున్నారు. యాక్టింగ్‌ అంటే అంత అభిమానం కాబట్టే  టీవీ స్క్రీన్‌ మీద కనిపించడానికీ మొహమాటపడ్డంలేదు. ‘‘ఇంటర్నెట్‌వాలా లవ్‌’’ అనే షోతో స్మాల్‌ స్క్రీన్‌ ప్రేక్షకులనూ అలరించనున్నారు. అందులో ఆమె వెడ్డింగ్‌ ప్లానర్, ఎఫ్‌ఎమ్‌ రేడియో స్టేషన్‌ ఓనర్‌గా పవర్‌ఫుల్‌ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడొస్తున్న టీవీ సీరియల్స్‌పై ఆమె కాస్త ఆగ్రహంగానే ఉన్నారు. 

గ్లిసరిన్‌ లేదంటే విలనీ టైప్‌
‘‘టీవీ అనేది అందరికీ అందుబాటులో ఉన్న మీడియం. ప్లస్‌ చాలా ప్రభావం చూపేది కూడా. అలాంటి టీవీ షోస్‌లో ఆడవాళ్లను శక్తిమంతమైన వాళ్లుగా, ఇన్‌స్పైరింగ్‌  పర్సనాలిటీస్‌గా చూపించాల్సింది పోయి.. కన్నీళ్లు కార్చే ఎమోషనల్‌ డిపెండెంట్‌ విమెన్‌గా.. లేదంటే సాటి మహిళల మీదే కక్ష కార్పణ్యాలతో కత్తిగట్టే విలన్లుగా చూపిస్తున్నారు. నిజంగా జీవితంలో అంత ఘోరంగా ఉంటారా ఎవరైనా? బయట మహిళలు ఎంతమంది మల్టీ టాస్కింగ్‌తో ఇళ్లను చక్కదిద్దుకోవట్లేదు? ఎంతమంది ఒంటరి మహిళలు సక్సెస్‌ఫుల్‌గా లైఫ్‌ లీడ్‌ చేయట్లేదు? అలాంటి వాళ్లను ప్రేరణగా తీసుకొని ఎందుకు సీరియల్స్, షోస్‌ను ప్లాన్‌ చేయరు? ఈ తరం అమ్మాయిలకు బయట ప్రపంచంలోని జీవితాలే బోల్డెంత స్ఫూర్తినిస్తున్నాయి. ఈ టీవీ సీరియల్స్‌ ఆ స్ఫూర్తిని చంపేస్తున్నాయి. థాంక్‌  గాడ్‌.. ‘ఇంటర్నెట్‌ వాలా లవ్‌’ అలాంటి షో కాదు. ఇండిపెండెంట్‌గా.. యంగ్‌ ఎంట్రప్రెన్యూర్‌గా బతికే ఓ ఉమన్‌  స్టోరీ ఇది. అందుకే ఈ సీరియల్‌ చేస్తున్నాను. సినిమా మేకర్స్‌దే కాదు సీరియల్‌ మేకర్స్‌ ఆలోచనా ధోరణి కూడా మారాలి. విమెన్‌ పవర్‌ఫుల్‌గా.. ఇండిపెండెంట్‌గా చూపించే కథలు రాయాలి. ఇప్పుడు మన సొసైటీకి అలాంటి రోల్‌ మోడల్స్‌ చాలా అవసరం. అప్పుడే మగవాళ్లకు మహిళల పట్ల కాస్తయినా గౌరవం పెరగొచ్చు. ఇంట్లో తల్లిదండ్రులూ అమ్మాయిల విషయంలో మారే అవకాశం ఉంటుంది’’ అని చెప్పింది మినిషా లాంబా. 

ఆపండి ఇక
ఇంటర్నెట్‌ వాలా లవ్‌లో.. ట్రోలింగ్స్‌ మీద కూడా చురకలు ఉంటాయట. ‘‘మనిషి మొహం పట్టుకొని అవమానించడమో.. తిట్టడమో చేయం కదా! ప్రతి వాళ్లకు వాళ్ల పర్సనల్‌ చాయిస్‌ ఉంటుంది. వాళ్లకే సొంతమైన లైఫ్‌ స్టయిల్‌ ఉంటుంది. పర్సనల్‌ చాయిస్‌ ఉంటుంది. ఆ విషయాన్ని మరిచిపోయి ఎదుటి వాళ్ల గురించి ఏదేదో ఊహించుకుని పబ్లిగ్గా నోరెలా పారేసుకుంటారు?’’ అని నిలదీశారు మినిషా. అకస్మాత్తుగా ఆమె ఎందుకలా స్పందించారనే కదా డౌట్‌? యెస్‌.. ఆమె ఆగ్రహానికి రీజన్‌ ట్రోలింగే. ‘‘సోషల్‌ మీడియా అనేది ఒక పవర్‌ఫుల్‌ ప్లాట్‌ ఫామ్‌. సామాజిక, రాజకీయ మార్పుల కోసం ఎన్నో దేశాలు ఈ సోషల్‌ మీడియాను మంచి మీడియంగా వాడుకున్నాయి. కానీ దురదృష్టమేమంటే చాలా చోట్ల ఇది వ్యక్తిగత వెక్కిరింపులు, ట్రోలింగ్స్‌కూ వేదికగా మారుతోంది. వ్యక్తుల మీద, వాళ్ల అభిప్రాయాల మీద ఉన్న అక్కసును, కోపాన్ని ట్రోలింగ్స్‌ ద్వారా తీర్చుకుంటున్నారు ఎంతో మంది. ఇది చాలా తప్పు. ఆదరాభిమానాలు, గౌరవాన్ని పెంపొందించాల్సింది పోయి ద్వేషాన్ని పెంచుతున్నాయి. ఈ ట్రోలింగ్స్‌ వల్ల మానసికంగా ఏ కొంచెం వీక్‌గా ఉన్నా మనుషులు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉంది. అమ్మాయిలు, విమెన్‌ సెలబ్రిటీస్‌ పట్ల అయితే ఇది మరీ దారుణంగా ఉంది. దయచేసి సెన్సిటివ్‌గా ఆలోచించండి. ట్రోలింగ్స్‌ను ఆపండి. అలాగే ట్రోలింగ్‌కు గురైన వాళ్లు కూడా వీక్‌గా మారొద్దు. జీవితంలో ఇలాంటివి సాధారణమే అనుకొని ఇగ్నోర్‌ చేయండి. స్ట్రాంగ్‌గా ఉండండి. అంతే ధీమాతో వాటిని ఎదుర్కోండి’’అంటూ అమ్మాయిలకు ధైర్యమిస్తున్నారు మినిషా లాంబా. ఇంటర్నెట్‌ వాలా లవ్‌ ప్రమోషన్‌ కోసం ఏ నగరానికి వెళ్లినా ‘స్టాప్‌ ట్రోలింగ్‌’ అనే పర్సనల్‌ క్యాంపెయిన్‌ చేస్తున్నారు మినిషా. 

మరిన్ని వార్తలు