సినీరంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది

28 May, 2020 03:01 IST|Sakshi
తలసాని శ్రీనివాస యాదవ్‌తో సి. కల్యాణ్, ‘దిల్‌’ రాజు

– తలసాని శ్రీనివాసయాదవ్‌

‘‘సినిమా రంగం అభివృద్ధికి దేశంలోనే బెస్ట్‌ పాలసీ తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది’’ అన్నారు తెలంగాణ సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక, మత్య్సశాఖల మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌. బుధవారం హైదరాబాద్‌లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో సినిమా, టీవీల షూటింగ్‌లు, థియేటర్స్‌ ఓపెనింగ్‌ తదితర అంశాలపై సినీ ప్రముఖులు, తెలుగు టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానెళ్ల నిర్వాహకులతో ఆయన చర్చించారు. ‘‘దాదాపు 85 సినిమాలు షూటింగ్‌కు సంబంధించిన వివిధ దశల్లో ఉన్నాయి. షూటింగ్‌లకు అనుమతులు ఇస్తే ఎందరికో ఉపాధి లభిస్తుంది.

షూటింగ్‌లు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను తప్పక పాటిస్తాం’’ అని ఈ సమావేశంలో పాల్గొన్నవారు తలసానికి చెప్పారు. ‘‘సినిమా షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కానీ షూటింగ్‌ ప్రదేశాల్లో ఎదురయ్యే ఇబ్బందులు, థియేటర్స్‌ను తెరచిన తర్వాతి పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు తలసాని. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు మురళీమోహన్, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ రామ్మోహనరావు, ‘మా’ అధ్యక్షుడు నరేష్, నిర్మాతలు సి.కల్యాణ్, ‘దిల్‌’రాజు, సురేందర్‌రెడ్డి, దామోదర్‌ ప్రసాద్, డైరెక్టర్స్‌ ఎన్‌.శంకర్‌లతో పాటుగా టీవీ చానెళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు