‘మిస్సమ్మ’ నిర్మాత సత్యనారాయణ కన్నుమూత

30 Aug, 2015 01:16 IST|Sakshi
‘మిస్సమ్మ’ నిర్మాత సత్యనారాయణ కన్నుమూత

ప్రముఖ నిర్మాత బి. సత్యనారాయణ (61) ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం తిరుపతిలో తుది శ్వాస విడిచారు. సత్యం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ‘బాలీవుడ్ కాలింగ్’ ఆనే ఆంగ్ల చిత్రం ద్వారా ఆయన నిర్మాతగా ఎంటరయ్యారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శితం కావడం విశేషం. ఆ తర్వాత ఆయన ‘ధనలక్ష్మీ ఐ లవ్ యు’, ‘మిస్సమ్మ’, ఇంద్రగంటి మోహనకృష్ణతో ‘మాయాబజార్’ చిత్రాలు నిర్మించారు. శివాజీ, భూమిక కాంబినేషన్‌లో నీలకంఠ దర్శకత్వంలో రూపొందిన ‘మిస్సమ్మ’ ఆయనకు మంచి పేరు తెచ్చింది.

సత్యనారాయణకు భార్య (అన్నపూర్ణ), ఇద్దరు కుమార్తెలు (హరిత, తేజస్వి) ఉన్నారు. ఆయన అంత్యక్రియలు  ఆదివారం తిరుపతిలో జరుగుతాయి. సత్యనారాయణ మరణానికి నిర్మాతల మండలి సంతాపం వ్యక్తం చేసింది.