కమల్‌తో నటించే అవకాశాన్ని చేజార్చుకున్నా

28 Sep, 2013 00:16 IST|Sakshi
కమల్‌తో నటించే అవకాశాన్ని చేజార్చుకున్నా
భాషా భేదంలేని ఏకైక పరిశ్రమ సినిమా. ఇక్కడ ఎవరైనా ఏ భాషలోనైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ప్రతిభకు అదృష్టం కలిస్తే వారి భవిష్యత్ ప్రకాశమే. ముఖ్యంగా వందవరగళై వాళవైక్కుమ్ (నమ్మి వచ్చిన వారిని ఆదరించే) పరిశ్రమ తమిళ సినిమా అంటారు. ఇక్కడ అన్ని భాషల వారు ఐక్యంగా పని చేస్తారు. అందరూ సినిమాలో భాగం కావాలని ఆశపడతారు. ప్రస్తుతం పలువురు టాలీవుడ్ యువ హీరోల దృష్టి కోలీవుడ్‌పై ఉందనేది వాస్తవం. ఆ వరుసలో యువ నటుడు బాలాదిత్య తాజాగా చేరారు. ప్రయత్నానికి ఫలితం ఉంటుంది. అలాగే నటుడు బాలాధిత్య కూడా తన ప్రయత్నంలో సఫలం అయ్యారు. బాలాదిత్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. బాల నటుడి నుంచి హీరోగా ఎదిగిన ఈయన తమిళ ప్రేక్షకుల ఆదరణ పొందడానికి సిద్ధం అవుతున్నారు. ఇటీవల శతాబ్ది భారతీయ వేడుకలో పాల్గొనడానికి చెన్నై వచ్చిన బాలాదిత్య తన అభిప్రాయాలు పంచుకున్నారు.
 
 ***  సంతోషంగా ఉన్నాను
 తెలుగు ప్రేక్షకుల ఆదరణతో చాలా ఖుషీగా ఉన్నాను. హీరోగా నా తొలి చిత్రం చంటిగాడు మంచి విజయం సాధించింది. ఆ తర్వాత సుందరానికి తొందరెక్కువ చిత్రం నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. 1940లో ఓ గ్రామం చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. అటుపై వందకోట్లు (సూపర్ స్టార్ కృష్ణ గౌరవపాత్ర చేశారు), అల్లరి నరేష్‌తో కలిసి నటించిన రూంమెట్స్, తదితర చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
 
 ***  బాల నటుడిగా మంచి గుర్తింపుపొందాను
 1991లో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం చిత్రంతో బాలనటుడిగా రంగప్రవేశం చేశాను. ఆ తరువాత శోభన్‌బాబు నటించిన దొరబా బు, ఏమండి ఆవిడి వచ్చింది, అక్కినేని నాగేశ్వరరావు నటిం చిన రాయుడు గారు.. నాయుడుగారు, తీర్పు, బాలకృష్ణ నటించిన శ్రీకృష్ణార్జున విజయం, బంగారు బుల్లోడు, చిరంజీవి నటించిన హిట్లర్, మోహన్‌బాబు చిత్రం రౌడీ పెళ్లాం తదితర చిత్రాలలో బాలనటుడిగా అందరి ప్రశంసలు అందుకున్నాను. ఇలా బాల నటుడిగా 108 చిత్రాలు చేశాను. 
 
 ***  ఇతర భాషల్లోనూ నటించా
 తమిళం, మలయాళం, కన్నడం, ఆంగ్లం భాషలలో నటించాను. మలయాళంలో సురేష్ గోపితో కలిసి మాస్‌మారం చిత్రంలోను, కళాభవన్ మణి నటించిన గురుశిష్యన్ చిత్రంలోను బాల నటుడిగా నటించాను. కన్నడంలో ఎడిద మణై కండ పక్కత్తు మణై ఎంతి అనే చిత్రలో నటించాను. ఆంగ్లంలో గాంధీ చిత్రం ఫేమ్ బెన్‌కింగ్స్‌లీతో కలిసి డ్రైవర్స్ అనే సీరియల్‌లో నటించాను. హిందీలో సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన త్యాగి చిత్రంలో ఆయన కొడుకుగా నటించే అదృష్టం కలిగింది. జితేంద్ర, జయప్రద జంటగా నటించిన లవకుశ చిత్రంలో లవుడిగా నటించడం మంచి అనుభూతి. 
 
 ***  కమల్‌తో నటించే అదృష్టాన్ని చేజార్చుకోవడం బాధాకరం
 తమిళంలో ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వంలో కైయళవు మనసు, చిన్నంజిరు ఉలగం సీరియళ్లలో నటించి ఆయన అభినందనలు అందుకోవడం సంతోషంగా ఉంది. కమల్‌హాసన్ నటించిన మహానది చిత్రంలో నటించే అవకాశం వచ్చినా తెలుగు చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాను. ఆ బాధ ఇప్పటికీ నా మనసులో ఉండిపోయింది. ప్రభుదేవా నటించిన నామ్ ఇరువర్ నమక్కు ఒరువర్ చిత్రలోనూ, అజిత్ చిత్రం రెట్టై జడై వయసు చిత్రంలోను బాల నటుడిగా నటించడం సంతోషంగా ఉంది. 
 
 ***  తమిళంలో నటించాలని ఆశ 
 తెలుగులో నచ్చిన కథా పాత్రలను అంగీకరిస్తూ నటిస్తున్నాను. తమిళంలో హీరో పాత్రలనే కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రల్ని పోషించాలని ఆశగా ఉంది. ప్రస్తుతం కొన్ని తమిళ చిత్రాల్లో నటించడానికి అంగీకరించాను. వీటి గురించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాను. తెలుగులో మాదిరిగానే తమిళంలోను మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక.

whatsapp channel