స్టార్ హీరోకు గాయాలు.. నిలిచిన షూటింగ్

17 Aug, 2017 18:18 IST|Sakshi
స్టార్ హీరోకు గాయాలు.. నిలిచిన షూటింగ్

లండన్‌ :
సినిమా షూటింగ్లో స్టంట్‌ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్కు గాయాలయ్యాయి. దీంతో 'మిషన్ ఇంపాజిబుల్ సిరీస్'లోని ఆరో భాగం షూటింగ్‌ ఆగిపోయింది. ఓ భారీ భవంతిపైనుంచి మరో భవంతి పైకి దూకే స్టంట్‌ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పరిగెత్తుకుంటూ వచ్చి మరో భవంతిపైకి దూకే సమయంలో జరిగిన చిన్న తప్పిదంతో నేరుగా వెళ్లి భవంతి గోడను ఢీకొట్టాడు. దీంతో అతని మోకాలి చిప్పకి బలమైన గాయమైంది. వెంటనే షూటింగ్‌ను నిలిపివేసి టామ్‌ను ఆసుపత్రికి తరలించారు. టామ్ కోలుకున్న తర్వాత షూటింగ్‌ తిరిగి ప్రారంభించనున్నట్టు పారామౌంట్‌ పిక్చర్స్‌ వెల్లడించింది.  

భారీ స్టంట్లు చేయడంలో 55 ఏళ్ల  టామ్‌ ఎప్పుడూ ముందుంటాడు. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్’లోని అయిదో భాగం 'రోగ్ నేషన్'లో విమానం టేకాఫ్‌ అవుతుండగా.. దాని తలుపు పట్టుకుని వేలాడే సీన్లోనూ టామ్‌ ప్రాణాలకు తెగించి స్టంట్‌ చేశాడు. ఘోస్ట్ ప్రొటోకాల్’లో కూడా దుబాయ్‌లోని ప్రపంచంలో ఎత్తయిన  బిల్డింగ్ బూర్జ్ ఖలీఫా టవర్ పై రిస్కీ స్టంట్స్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు టామ్.