ప్రజాసేవ.. కాసింత కళాపోషణ

22 Jul, 2020 13:29 IST|Sakshi
మ్మెల్యే కరణం ధర్మశ్రీ , బంగారు నంది అవార్డు పొందిన ‘దుర్గి’ సినిమాలో తండ్రి పాత్రలో ఒదిగిపోయిన ధర్మశ్రీ (పాతచిత్రం)

ప్రజాప్రతినిధిగా, కళాకారుడిగా  కరణం ధర్మశ్రీ రాణింపు

‘జై మోదకొండమ్మ’ లో సద్గురువు పాత్రలో నటిస్తున్న ఎమ్మెల్యే

హోం క్వారంటైన్‌లో ఉంటూ.. ఇంటి ఆవరణలో షూటింగ్‌ పూర్తి చేస్తున్న వైనం

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఆసక్తి.. అభిరుచి ఉంటుంది. ప్రజలకు సేవ చేయాలనే ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చినా.. మనసుకు నచ్చిన రంగంలో రాణిస్తూ తన అభిరుచిని చాటుతుంటారు. అలాంటి కోవకే చెందుతారు మన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ప్రజా సేవకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు చిన్నప్పటి నుంచి కళలంటే చాలా ఇష్టం. నాటకాలు వేశారు. సినిమాల్లో నటిస్తున్నారు. హరికథలు చెబుతారు.. ఇలా తనలోని కళాకారుడిని తట్టి లేపుతూ.. కళామ్మతల్లి సేవలో తరిస్తున్నారు. అయితే సందేశాత్మక చిత్రాలకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. హర్మోనియం, తబలా వంటి వాయిద్యాల నిర్వహణలోనూ ఆయనకు ప్రావీణ్యం ఉంది. రచయితగా, కవిగా కూడా ధర్మశ్రీ చోడవరం ప్రసన్నభారతిలో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పటికే ‘దుర్గి’తోపాటు పలు చిత్రాల్లో నటించిన ఆయన తాజాగా మరో సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.   
 
చోడవరం : ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన పోలాకి శివ దర్శకత్వంలో శ్రీ మోదశివ క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న ‘జై మోదకొండమ్మ’ సినిమాలో ఎమ్మెల్యే ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అమ్మవారి చరిత్రతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమ్మవారిగా ప్రముఖ హీరోయిన్‌ ప్రేమ నటిస్తుండగా.. సద్గురువు పాత్రలో ధర్మశ్రీ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చోడవరం, మాడుగుల, పాడేరు ప్రాంతాల్లో ప్రస్తుతం జోరుగా సాగుతోంది. హోం క్వారంటైన్‌లో ఉంటూనే ధర్మశ్రీ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను తన ఇంటి వద్దే సెట్‌ వేసి పూర్తి చేస్తున్నారు. సద్గురుపాత్రలో ఆయన చేస్తున్న నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని థియేటర్లు తెరిచిన తర్వాత ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
తొలి సినిమాకే బంగారు ‘నంది’  
2009లో ధర్మశ్రీ నటించిన తొలి సినిమాకే బంగారు నంది అవార్డు దక్కింది. ఒడిశా గిరిజన తండాలోని ఓ బాలిక యదార్థగాథపై తీసిన ‘దుర్గి’బాలల చిత్రంలో బాలిక దుర్గికి తండ్రిగా అప్పన్న పాత్రలో ధర్మశ్రీ కీలకపాత్ర పోషించారు. మెుదటిసారిగా వెండి తెరపై ఆయన కనిపించి.. పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అందరి మన్ననలు పొందారు. తాజాగా జై మోదకొండమ్మ సినిమాలో ఆయన నటించడంపై సర్వత్రా ఆసక్తినెలకొంది.  

కళలంటే చాలా ఇష్టం  
ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేస్తున్నప్పటికీ చిన్నతనం నుంచి కళారంగంపై నాకు ఆసక్తి ఎక్కువ. వీధి నాటకాలు, కళాశాలల్లో స్టేజీ నాటకాలు వేసేవాడిని. పూర్తిగా గ్రామీణ ప్రాంతంలోనే నా జీవితం గడవడం వల్ల.. పల్లె కథలంటే నాకు చాలా ఇష్టం. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నమయ్యగా ఏకపాత్రాభినయం చేశాను. నా ప్రదర్శన ఆయనకు ఎంతో నచ్చింది. అప్పటి నుంచి నన్ను అన్నమయ్య అని పిలిచేవారు. నా మొదటి సినిమా దుర్గికి నంది అవార్డు వచ్చింది. తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించాను. తాజాగా మా ప్రాంత ఇలవేల్పు శ్రీ మోదుకొండమ్మ తల్లి పేరుతో నిర్మిస్తున్న సినిమాలో ఒక మంచి పాత్రలో నటించడం ఆనందంగా ఉంది.        
– కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే, చోడవరం

మరిన్ని వార్తలు