వంశీ కథలు ఎంతో ఇష్టం

27 Dec, 2019 10:02 IST|Sakshi

సినీ సంగీత దర్శకుడు కీరవాణి  

‘పుస్తకాలు చాలా తక్కువగానే చదువుతాను. కానీ నచ్చిన పుస్తకాలు మాత్రం తప్పనిసరిగా చదివి తీరుతా’ అన్నారు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఎన్టీఆర్‌ స్టేడియంలో పుస్తక ప్రదర్శనను గురువారం ఆయన సందర్శించారు. పలు స్టాళ్లలో ఆయన తనకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. వంశీ సాహిత్యం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఆ పుస్తకాల కోసం ప్రదర్శనకు వచ్చినట్లు పేర్కొన్నారు. వంశీ రాసిన ‘నల్లమిల్లోరి పాలెం’ కథల పుస్తకంతో పాటు, ‘కచ్చితంగా నాకుతెలుసు’.. ‘తెలుగాంధ్ర మిశ్రమ నిఘంటువు’ తదితర పుస్తకాలను ఆయన కొనుగోలు చేశారు. అన్వేషిక స్టాల్‌లోని పలు సినీ రచయితల పుస్తకాలను కీరవాణి ఆసక్తిగాతిలకించారు.  

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌కు నాలుగో రోజు గురువారం పుస్తక ప్రియులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. క్రిస్మస్‌ సెలవులతో సందర్శకుల రద్దీ కనిపించింది. సాహితీ సభలు, పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో బుక్‌ఫెయిర్‌లో సందడిగా మారింది. సాహిత్యం, చరిత్ర, ఆర్థిక అంశాలకు సంబంధించిన అనేక అంశాలపైన పాఠకులు తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. మరోవైపు బాలమేళా కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల మేజిక్‌ వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సుమారు 90 మంది రచయితలతో  ఏర్పాటు చేసిన రైటర్స్‌ స్టాల్, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు, నవతెలంగాణ, స్కోలాస్టిక్, అన్వేషిక, ఎమెస్కో, పెంగ్విన్‌ తదితర స్టాళ్ల వద్ద పాఠకులు నచ్చిన పుస్తకాల కోసం అన్వేషించారు. ఇటీవల  విడుదలైన జార్జిరెడ్డి సినిమా పెద్ద ఎత్తున ప్రభావం చూపిన సంగతి  తెలిసిందే. ఆయన జీవితంపై ప్రముఖ రచయిత్రి కాత్యాయని రాసిన ‘జీనా హైతో మర్‌నా సీఖో’ పుస్తకానికి డిమాండ్‌ బాగా కనిపించింది.

ప్రతి రోజు భారీ సంఖ్యలో పాఠకులు ఈ పుస్తకాన్ని కొనుగోలు చేస్తున్నారు. బొగోమ లోవ్‌ రాసిన ప్లాటో–అరిస్టాటిల్,  కేవీ గోపాలచారి రచన ‘జింక సైన్స్‌ అను మన గురించి మనం’ వంటి పుస్తకాలతో పాటు జ్యోతిబాపూలే రచనలు, ఓ కుక్క ఆత్మకథ నవల, చేగువేరా, గౌరీ లంకేష్‌ కొలిమి రవ్వలు, బాలగోపాల్‌ రాసిన అణచివేత– అణచివేత చట్టాలు పుస్తకాలపై పాఠకులు అమిత ఆసక్తి చూపుతున్నారు. వర్ధమాన రచయిత్రి కడలి సత్యనారాయణ రాసిన ‘లెటర్స్‌ టు లవ్‌’, పలువురు యువ రచయితల తొలిప్రేమ కథలు, ఇన్‌ ది మూడ్‌ ఫర్‌ లవ్, రష్యన్‌ క్లాసిక్స్‌ వంటి సరికొత్త రచనలకు సైతం డిమాండ్‌ బాగా ఉంది. పిల్లల కోసంప్రత్యేకంగా పుస్తకాలు ముద్రించి విక్రయించే స్కొలాస్టిక్స్‌ (స్టాల్‌ నంబర్‌ 23)లో ఫిక్షన్‌ సాహిత్యం కోసం చిన్నారులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. టార్గెట్స్, బ్యాడ్‌బాయ్స్, జెర్నిమోస్టిల్‌టన్, డాగ్‌మ్యాన్, 2020 ఇయర్‌ బుక్, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ లిటరేచర్, అబ్దుల్‌ కలాం రచనలను విద్యార్థులు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా